తమిళనాడు రాజ్‌‌భవన్‌‌పై పెట్రోల్‌‌ బాంబు దాడి

తమిళనాడు రాజ్‌‌భవన్‌‌పై పెట్రోల్‌‌ బాంబు దాడి

చెన్నై: తమిళనాడు గవర్నర్ హౌస్​పై ఓ వ్యక్తి పెట్రోల్‌‌ బాంబు విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడు బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని రాజ్‌‌భవన్‌‌ గేటు ముందుకు వచ్చి నిలబడ్డాడు. సడెన్ గా  తన వద్ద ఉన్న పెట్రోల్ బాంబును బయటకు తీసి, దానికి నిప్పు అంటించాడు. రాజ్‌‌భవన్‌‌ గేటు ముందు విసిరేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.  

సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. నిప్పును ఆర్పేసి, నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని కరుక్క వినోద్ గా పోలీసులు గుర్తించారు. వినోద్ మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు..అతనికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌‌గా మాజీ డీజీపీ శైలేంద్ర బాబును నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్ ఆర్‌‌ఎన్ రవికి సిఫార్సు చేసింది. 

కానీ గవర్నర్ తిరస్కరించారు. అందువల్లే రాజ్‌‌భవన్​పై వినోద్ పెట్రోల్ బాంబు విసిరేందుకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వినోద్ గతంలోనూ  బీజేపీ ఆఫీసుపై బాంబులు విసిరినట్లు తెలిపారు.