16 శాతం పెరిగిన విమాన ఇంధ‌నం

16 శాతం పెరిగిన విమాన ఇంధ‌నం

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా పెట్రోల్ ధ‌ర‌ల పెంపు జోలికి వెళ్ల‌ని ఆయిల్ కంపెనీలు.. దాదాపు 82 రోజుల త‌ర్వాత వ‌రుస‌గా వినియోగ‌దారుడిపై భారం మోప‌డం స్టార్ట్ చేశాయి. జూన్ 7 నుంచి మొద‌లు పెట్టి.. వ‌రుస‌గా ఇవాళ ప‌దో రోజు పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను పెంచాయి. మంగ‌ళ‌వారం పెట్రోల్‌పై 47 పైస‌లు, డీజిల్‌పై 57 పైస‌లు వ‌డ్డించాయి. ఈ 10 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.45 , డీజిల్ ధర లీటరుకు రూ.5.8 పెరిగింది. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌నులు లేక ఆదాయం త‌గ్గిపోయిన సామాన్యుల‌పై ఈ పెట్రోల్, డీజిల్ పెంపు పెను భారంగా మారుతోంది.
తాజాగా మంగ‌ళ‌వారం పెరిగిన ధ‌ర‌ల‌తో ప్ర‌స్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీట‌రు రూ.76.73కు, డీజిల్ లీట‌రుకు రూ.75.19కి చేరింది. ఆయా రాష్ట్రాల్లో ప‌న్నుల‌ను బ‌ట్టి ఈ రేట్ల‌తో స్వ‌ల్పంగా హెచ్చుత‌గ్గులు ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.83.62, డీజిల్ రూ.73.75, హైద‌రాబాద్‌లో పెట్రోలు ధర రూ.79.65, డీజిల్ రూ.73.49గా ఉంది.

16 శాతం పెరిగిన విమాన ఇంధ‌నం

పెట్రోల్, డీజిల్ రేట్ల‌తో పాటు విమానాల్లో ఇంధ‌నంగా వాడే ఎయిర్ ట‌ర్బైన్ ఫ్యూయ‌ల్ (ఏటీఎఫ్) ధ‌ర‌ల‌ను కూడా పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఏటీఎఫ్ రేటును 16.3 శాతం పెంచ‌డంతో వెయ్యి లీట‌ర్లకు రూ.5494.5 చొప్పున అద‌న‌పు భారం ప‌డ‌నుంది. దీంతో పెరిగిన ధ‌ర వెయ్యి లీట‌ర్లు రూ.39,069.87గా ఉంది. ఈ నెల‌లో ఇప్ప‌టికే రెండోసారి ఏటీఎఫ్ ధ‌ర‌ను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఏటీఎఫ్ ధ‌ర‌ల‌ను ప్ర‌తి నెలా 1, 16 తేదీల్లో రివైజ్ చేస్తాయి. దీంతో ఒక‌టో తేదీ, ఇవాళ రేట్ల‌ను పెంచేశాయి. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా విమాన స‌ర్వీసులు నెల‌ల త‌ర‌బ‌డి నిలిచిపోయిన నేప‌థ్యంలో న‌ష్టాల్లో ఉన్న విమాన‌యాన కంపెనీల‌పై ఇప్పుడు ఇంధ‌న ధ‌ర‌ల పెంపు అద‌న‌పు భారం కానుంది.