న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. ఇరాన్ టాప్ జనరల్‌ను అమెరికా చంపిన తర్వాత గ్లోబల్‌గా పెరుగుతూ వస్తోన్న క్రూడాయిల్ ధరల వల్ల మన దగ్గర ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ ఫ్యూయల్ రిటైలర్స్ ధరల నోటిఫికేషన్ ప్రకారం, లీటరు పెట్రోల్ ధర 9 పైసలు, లీటరు డీజిల్ ధర 11 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.75.54 పలుకుతోంది. ఈ ఏడాదిలో హయ్యస్ట్ ధర ఇదే. లీటరు డీజిల్ ధర రూ.68.51గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.80.32గా, లీటరు డీజిల్ ధర రూ.74.70గా రికార్డయింది. అంటే మనకు ఢిల్లీకి మధ్య పెట్రోల్ ధరలో తేడా రూ.4.78గా ఉంది. ఖాసీం సులేమానీను అమెరికా చంపడంతో, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడవుతున్నాయి. ఆయిల్ ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. ఇండియా తన ఆయిల్ అవసరాల్లో 84 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గ్లోబల్‌గా ధరలు పెరిగితే, మన దేశంలో కూడా పెట్రో ధరలు భగ్గుమంటాయి. ఇండియాకు దిగుమతి అవుతున్న ఆయిల్‌లో మూడింట రెండో వంతుకు పైగా మధ్య ఆసియాల దేశాల నుంచే వస్తోంది. వాటిలో ఇరాక్, సౌదీ అరేబియాలు టాప్ సప్లయిర్స్‌గా ఉన్నాయి. అయితే ఇరాన్‌పై అమెరికా దాడులతో ఇండియాకు సరఫరా అయ్యే ఆయిల్ దిగుమతుల్లో ఎలాంటి అవాంతరం లేదని ప్రభుత్వాధికారులు చెప్పారు.
