వాహనదారులకు పిడుగులాంటి వార్త: దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వాహనదారులకు పిడుగులాంటి వార్త: దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: పొద్దుపొద్దునే వాహనదారులకు పిడుగు లాంటి వార్త. దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం (మే 23) దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర లీటరుకు 91 పైసల మేర ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాళ (మే 23) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.

తాజా పెంపుతో హైదరాబాద్‎లో పెట్రోల్ ధర లీటరుకు రూ.112.84, డీజిల్ ధర లీటరుకు రూ100.94కు చేరుకుంది. పెరుగుతున్న ప్రపంచ ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో గత 10 రోజుల్లోనే దేశంలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో 2026, మే 15న దేశీయ చమురు సంస్ధలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 మేర పెంచాయి.

 వాహనదారులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే 2026, మే 19న మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. దేశవాప్తంగా పెట్రోల్, డీజిల్‎పై సుమారు 90 పైసల మేర పెరిగింది. ఇదిలా ఉండగానే.. శనివారం (మే 23) మరోసారి దేశంలో ఇంధన ధరలు పెరగడం గమనార్హం. ఇప్పటికే భారీగా పెరిగిపోయిన నిత్యవసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య జనానికి పెట్రోల్, డీజిల్ ధరల వరుస పెంపు మరింత భారంగా మారుతోంది.