ఐఏఎస్ ల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు?..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఐఏఎస్ ల  పిల్లలకు  రిజర్వేషన్లు ఎందుకు?..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
  • -ఒకసారి రిజర్వేషన్‌‌‌‌తో సామాజిక మార్పు వచ్చాక మళ్లీ కోటా అవసరమా?
  • ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం
  • తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత పిల్లల పరిస్థితి కూడా మారుతుంది
  • ఆ కుటుంబాలను రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి క్రమంగా బయటకు తీసుకురావాలి
  • ఈడబ్ల్యూఎస్ వేరు.. క్రీమీలేయర్ వేరు.. రిజర్వేషన్ల అమలులో బ్యాలెన్స్‌‌‌‌ అవసరమని వ్యాఖ్య
  • కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేసిన పిటిషన్‌‌‌‌పై విచారణ

న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  రిజర్వేషన్ల ఫలాలు పొంది ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాల పిల్లలకు కోటా ప్రయోజనాలను ఇంకా ఎందుకు పొడిగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ద్వారా లభించిన సామాజిక పురోగతి.. సదరు కుటుంబాలను రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి క్రమంగా బయటకు తీసుకురావాలని  స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీలేయర్’ (ఆదాయం, హోదా పరంగా ముందంజలో ఉన్నవారు) మినహాయింపులకు సంబంధించిన ఓ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌‌‌‌‌‌‌‌లతో కూడిన ధర్మాసనం  కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా లబ్ధిపొంది సామాజిక, ఆర్థిక సాధికారత తర్వాత తమ కుటుంబంలోని తర్వాతి తరానికి అదే రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ పొందే విషయంలో ఎవరికి వారు పునః పరిశీలించుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలు పదేపదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే కోటా ఎందుకు?

తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉంటూ, మంచి జీతాలు, ఉన్నత హోదాల్లో స్థిరపడిన వారి పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరమా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులుగా సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారిలో సామాజిక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి వారిని రిజర్వేషన్ల నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ మినహాయింపులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం? ఈ కోణాన్ని కూడా మనం ఆలోచించాలి’’ అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.  విద్యా, ఆర్థిక సాధికారతతో సమాజంలో ఉన్నత హోదా లభిస్తుందని, ఆ తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు కోరుకుంటూ పోతే.. మనం ఈ రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేమని బెంచ్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడింది. ఇది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం అని వ్యాఖ్యానించింది.  

రిజర్వేషన్ల అమలులో బ్యాలెన్స్ ఉండాలి

ఈ కేసులో పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ శశాంక్ రత్నూ.. సదరు అధికారులను వారి జీతాల ఆధారంగా కాకుండా, వారి హోదా ఆధారంగా రిజర్వేషన్ల నుంచి మినహాయించారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై లోతైన పరిశీలన జరగాలని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌) కోటాకు, ఓబీసీ క్రీమీలేయర్‌‌‌‌‌‌‌‌కు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ఆయన కోరారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ.. ‘‘ఈడబ్ల్యూఎస్  వర్గాల్లో సామాజిక వెనుకబాటుతనం ఉండదు, కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుంది”అని స్పష్టం చేశారు. అయితే క్రీమీలేయర్ నిబంధనలు ఈడబ్ల్యూఎస్ కంటే కొంత సరళంగా ఉండాలని, రెండింటినీ ఒకేలా చూస్తే వాటి మధ్య వ్యత్యాసం ఉండదని లాయర్ వాదించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం స్పందిస్తూ.. క్రీమీలేయర్ నిబంధనలను ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ నిబంధనలతో సమానంగా చూడలేమని, ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ పాటించాల్సిన అవసరం ఉందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు.  ఒక వ్యక్తి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉండవచ్చని.. కానీ, ఒకసారి రిజర్వేషన్ల ప్రయోజనం పొంది తల్లిదండ్రులు సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాక, వారి పిల్లల విషయంలో పరిస్థితి మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై స్పందించాలంటూ సంబంధిత పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 

కేసు నేపథ్యం ఇదే..

కర్నాటక పవర్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో ‘అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)’ ఉద్యోగానికి ఓ అభ్యర్థి రిజర్వేషన్ కేటగిరీ (కురుబ సామాజిక వర్గం) కింద ఎంపికయ్యారు. అయితే, అతని తల్లిదండ్రులు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో పాటు  వారి ఉమ్మడి వార్షిక ఆదాయం రూ. 8 లక్షల పరిమితి కంటే ఎక్కువగా ఉందని జిల్లా కుల, ఆదాయ ధ్రువీకరణ కమిటీ గుర్తించింది. దీంతో అతడిని ‘క్రీమీలేయర్’ కింద పరిగణించి కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కర్నాటక హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై స్పందించాలంటూ నోటీసులు జారీ చేసింది.