పెట్రో ధరల తగ్గింపు ఇయ్యాల్టి నుంచే

పెట్రో ధరల తగ్గింపు ఇయ్యాల్టి నుంచే
  • కేంద్రం తగ్గించింది.. మరి రాష్ట్రం..?
  • ఎక్సైజ్​ డ్యూటీని భారీగా తగ్గించిన కేంద్రం
  • వాహనదారులకు కొంత ఊరట
  • పెట్రోల్​పై రూ.5, డీజిల్​పై 10 తగ్గినయ్​
  • వ్యాట్​ను తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన
  • వ్యాట్​ కూడా తగ్గితే మరింత దిగనున్న ధరలు

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు మండిన పెట్రోల్, డీజిల్​ ధరలు  తగ్గాయి. ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. లీటరు పెట్రోల్‌‌పై రూ. 5, లీటర్​ డీజిల్‌‌పై  రూ. 10 చొప్పున ఎక్సైజ్​ డ్యూటీని తగ్గిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇదే స్థాయిలో పెట్రోల్​, డీజిల్​ ధరలు దిగిరానున్నాయి. కొత్త రేట్లు  గురువారం నుంచి అమల్లోకి వస్తాయి.  బుధవారం వరకు హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 114.49 ఉండగా.. గురువారం రూ. 109.49కు దిగే అవకాశం ఉంది. లీటర్​ డీజిల్​ రేట్​ రూ. 107.40 ఉండగా.. గురువారం రూ. 97.40కు దిగే చాన్స్​ ఉంది. డీజిల్‌‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు భారీగా ఉండటం వల్ల రాబోయే యాసంగి సీజన్‌‌లో రైతులకు మేలు జరుగుతుందని, వాళ్లకు ఖర్చులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనంపై పెట్రో భారాన్ని దించడానికి వ్యాట్‌‌ను కూడా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. 
పెట్రోల్​ ధరలో 32.9 శాతం వరకు, డీజిల్‌ ధరలో 34 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై 23 శాతం, డీజిల్‌పై 15 శాతం వ్యాట్‌/సేల్స్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తుంటాయి.  డీలర్‌ కమీషన్ పెట్రోల్​పై నాలుగు శాతం, డీజిల్​పై  మూడు శాతం ఉంటుంది.  ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్​ ట్యాక్స్​ను తగ్గించడంతో దీపావళి వేళ వాహనదారులకు కొంత ఊరట కలిగినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్​ను తగ్గిస్తే మరింత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లీటరు పెట్రోల్​పై ఎక్సైజ్‌ డ్యూటీని ఒక రూపాయి తగ్గిస్తే కేంద్రానికి దాదాపు రూ.14 వేల కోట్ల వరకు నష్టం వస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే తాజా నిర్ణయం వల్ల కేంద్రానికి రూ. 2.10 లక్షల కోట్ల వరకు ఆదాయం తగ్గుతుంది. 
ఇంటర్నేషనల్‌ ధరలు జూమ్‌ 
కరోనా రావడంతో గ్లోబల్‌ మార్కెట్లు దెబ్బతిని.. నిరుడు క్రూడాయిల్‌ ధరలు రికార్డుస్థాయిలో తగ్గాయి. పెట్రో ప్రొడక్టులకు డిమాండ్‌ విపరీతంగా పడిపోవడమే ఇందుకు కారణం. అయితే రేట్ల తగ్గింపు లాభాన్ని జనానికి సర్కారు ఇవ్వలేదు. నిరుడు రూ. 19.98 వరకు ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని క్రమంగా రూ. 32.9కు పెంచింది. కరోనా ఎఫెక్ట్‌ తగ్గినప్పటి నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్​లో క్రూడాయిల్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే,  ఒపెక్‌ దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో బ్యారెల్‌ ధర 85 డాలర్లకుపైగా పలుకుతోంది. దీంతో మనదేశంలోనూ ఆయిల్‌ ధరలను పెంచారు. ఈ ఏడాది సెప్టెంబర్​ మొదటివారం నుంచి ధరలు విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. అప్పటి నుంచి పెట్రోల్‌ ధర రూ. 8.85 వరకు పెరిగింది. పెరుగుదల  వల్ల ఎకానమీపై పెద్ద ఎఫెక్టే కనిపించడంతో కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించాలని నిర్ణయించింది. 
వ్యాట్​ తగ్గించిన ఐదు రాష్ట్రాలు
పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో.. రాష్ట్రాలు వ్యాట్​ను తగ్గించేందుకు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వాహనదారులపై భారం పడకుండా చూడాలన్న  కేంద్ర ప్రభుత్వ సూచనతో అసోం, త్రిపుర, కర్నాటక, గోవా, బీహార్​ ప్రభుత్వాలు స్పందించాయి. పెట్రోల్​, డీజిల్​పై అసోం, త్రిపుర, కర్నాటక, గోవా ప్రభుత్వాలు వ్యాట్​ను రూ. 7 తగ్గించాయి. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనతో పెట్రోల్​ ధర రూ. 12 , డీజిల్  ధర రూ. 17 తగ్గే అవకాశం ఉంది. బీహార్​ ప్రభుత్వం పెట్రోల్​పై రూ. 1.30, డీజిల్​పై రూ. 1.90 తగ్గించింది. మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్​ను తగ్గించే పనిలో పడ్డాయి. అయితే.. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.