మళ్లీ పెట్రో బాదుడు

మళ్లీ పెట్రో బాదుడు

న్యూఢిల్లీ : లోక్‌‌సభ ఎన్నికలు ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలొచ్చాయి. గత తొమ్మిది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 70 పైసల నుంచి 80 పైసల మేర పెరిగాయి. మే 19తో లోక్‌‌సభ ఎన్నికల తుది దశ పోలింగ్‌‌ ముగిసింది. దీంతో ఆ తర్వాత రోజు నుంచి పెట్రోల్ ధర పెరగడం ప్రారంభమైంది. ఈ తొమ్మిది రోజుల్లో లీటరు పెట్రోల్ ధర 83 పైసలు పెరిగిందని, లీటరు డీజిల్ ధర 73 పైసలు పెరిగిందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌‌లో ఆయిల్ ధరలు పెరుగుతున్నా.. దేశీయంగా ఎన్నికలు జరుగుతుండటంతో, ఇంధన ధరలు పెరగకుండా స్తబ్దుగా ఉన్నాయి. ఎన్నికలు అయిపోవడంతో వీటికి రెక్కలు వచ్చాయి.

మంగళవారం ఒక్కరోజే లీటరు పెట్రోల్ ధర 11 పైసలు, లీటరు డీజిల్ ధర 5 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర ప్రస్తుతం లీటరుకు రూ.71.86, డీజిల్ ధర లీటరుకు రూ.66.69 పలుకుతోంది. అదేవిధంగా ముంబైలో లీటరు పెట్రోల్ కాస్ట్ రూ.77.47, లీటరు డీజిల్ ధర రూ.69.88గా నమోదవుతోంది. హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్ ధర రూ.76.22గా, లీటరు డీజిల్ ధర రూ.72.53గా ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఆయిల్ రిటైలర్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌‌లు పూర్తిగా ధరలు పెంచకుండా అలానే ఉంచాయి. పెరిగిన రేట్లను కన్జ్యూమర్లకు బదలాయించలేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. వాటిని ప్రస్తుతం కంపెనీలు రికవరీ చేసుకుంటున్నాయని తెలిపాయి.