బీపీసీఎల్​ రైట్స్​ ఇష్యూకి గ్రీన్​ సిగ్నల్​.. రూ. 18 వేల కోట్ల సమీకరణ

బీపీసీఎల్​ రైట్స్​ ఇష్యూకి గ్రీన్​ సిగ్నల్​..    రూ. 18 వేల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీ భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (బీపీసీఎల్​) రూ. 18 వేల కోట్ల సమీకరణ కోసం రైట్స్​ ఇష్యూ చేపడుతోంది. రైట్స్ ఇష్యూ కి బోర్డు ఆమోదం వచ్చినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు బీపీసీఎల్​ సమాచారం అందించింది. రైట్స్​ ఇష్యూ షేర్ల ధర, రికార్డు డేట్​, ఇతర వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. బీపీసీఎల్​ ఈక్విటీలో మరింత పెట్టుబడి పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ  ఆలోచనతోనే  బీపీసీఎల్​ రైట్స్​ ఇష్యూకు వస్తోంది. 

చమురు రంగంలోని  పీఎస్​యూ కంపెనీలకు రూ. 35 వేల కోట్ల క్యాపిటల్​ సపోర్ట్​ ఇవ్వనున్నట్లు ఈ ఏడాది బడ్జెట్లో ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐఓసీ, హెచ్​పీసీఎల్​ల నుంచి కూడా రైట్స్​ ఇష్యూలు వస్తాయని స్టాక్​ మార్కెట్​ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే ఇటీవలే ఐఓసీ తన ఆథరైజ్డ్​ ఈక్విటీని రెట్టింపు చేసింది. ఈ కంపెనీ ఆథరైజ్డ్​ ఈక్విటీ ఇప్పుడు రూ. 30 వేల కోట్లకు పెరిగింది.