ఫార్మా సంస్థ యజమానికి జైలు, రూ. 40 వేల ఫైన్: జగిత్యాల కోర్టు తీర్పు

ఫార్మా సంస్థ యజమానికి జైలు, రూ. 40 వేల ఫైన్: జగిత్యాల కోర్టు తీర్పు

జగిత్యాల రూరల్, వెలుగు: నాణ్యత లేని మందులు తయారు చేసి అమ్మిన కేసులో ఔషధ సంస్థ యజమానికి వారం జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శ్రీనిజ మంగళవారం తీర్పు ఇచ్చారు. డిస్ట్రిక్ట్ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ వి.ఉపేందర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

2024, జులైలో జగిత్యాల జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రగ్స్ అధికారుల తనిఖీల్లో ఓ షాపులో మోక్సికామ్ సీవీ మెడిసిన్ నమూనాను స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌లోని ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ లో ఆ మందు నాణ్యత లేనిదిగా తేలింది. దీంతో హిమాచల్‌ప్రదేశ్ కు చెందిన కళింగ హెల్త్ కేర్ సంస్థ యజమాని వివేక్‌కుమార్‌పై మెడిసిన్ కాస్మోటిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో వాదనల అనంతరం జడ్జి తీర్పు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.