ఫార్మాకు వార్ దెబ్బ! 30 శాతం వరకు పెరిగిన ముడిసరుకుల ధరలు.. ఔషధాలు మరింత ఫిరం

ఫార్మాకు వార్ దెబ్బ! 30 శాతం వరకు పెరిగిన ముడిసరుకుల ధరలు.. ఔషధాలు మరింత ఫిరం
  • హార్మూజ్ మూతతో పెరుగుతున్న  షిప్పింగ్‌‌ ఖర్చులు.. 
  • ఔషధాలు, ఎంఆర్‌‌‌‌ఐ, వ్యవసాయ పరికరాల ధరలు పెరిగే ప్రమాదం
  • అత్యంత కీలకమైన పాలిమర్స్, సాల్వెంట్ల దిగుమతిపై ప్రభావం
  • ఇప్పటికే రూ.5 వేల కోట్ల దాకా ఎఫెక్ట్​ పడిందంటున్న ఫార్మెక్సిల్​
  • 8 వేల డాలర్లు పెరిగిన 
  • నౌకల షిప్పింగ్​ సర్​చార్జీ
  • ఇటు పీవీసీ, హెచ్‌‌డీసీలాంటి 
  • వాటి ధరలూ పెరుగుదల
  • పాలిమర్స్​, గ్యాస్​ బేస్డ్​ ఇండస్ట్రీలకూ ఎఫెక్ట్​.. వాటి ముడిసరుకుల 
  • ధరలు 20 శాతం హైక్​
  • హీలియం సరఫరా తగ్గడంతో ఎంఆర్‌‌‌‌ఐ  స్కానింగ్​ యంత్రాలపైనా తీవ్ర ప్రభావం
  • ఔషధాలు, ఎంఆర్‌‌‌‌ఐ, వ్యవసాయ పరికరాల ధరలు పెరిగే ప్రమాదం

హైదరాబాద్​, వెలుగు: ఇరాన్​, ఇజ్రాయెల్‌‌–అమెరికా వార్​ ఎఫెక్ట్​ దేశంలోని పరిశ్రమలపై తీవ్రంగా పడుతున్నది. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు పెద్ద పరిశ్రమలకూ యుద్ధం సెగ తగులుతున్నది. వార్‌‌‌‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే ఫార్మా ఇండస్ట్రీపై రూ.5 వేల కోట్ల దాకా ప్రభావం పడినట్టు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఫార్మాస్యూటికల్స్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా (ఫార్మెక్సిల్​) వెల్లడించింది. ఫార్మా ఇండస్ట్రీతోపాటు ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌‌లాంటి  స్కానింగ్​ యంత్రాలు, పీవీసీ పైపులు, ఫార్మాతోపాటు ఇతర రంగాలకు అవసరమైన పాలిమర్స్​ తయారీ పరిశ్రమలపై ప్రభావం​ తీవ్రంగా ఉన్నదని ఇండస్ట్రీస్​ ఎక్స్‌‌పర్ట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 ఇరాన్​, అమెరికాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతుండడంతో.. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలక రవాణామార్గమైన పర్షియన్​ గల్ఫ్‌‌‌‌లోని హార్మూజ్​ జలసంధి దాదాపు మూతపడింది. దీంతో ఫార్మా పరిశ్రమతోపాటు ఇతర రంగాల పరిశ్రమలకు పశ్చిమాసియా దేశాల నుంచి రావాల్సిన కీలక ముడిపదార్థాల రవాణా తగ్గిపోయింది. ఇటు దిగుమతులు, అటు ఎగుమతులు స్తంభించడంతో ఆ ప్రభావం పరిశ్రమలపై పడుతున్నది. ఫలితంగా రాబోయే కొన్ని రోజుల్లో ప్రజలూ దాని ప్రభావాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర  ఔషధాల రేట్లు, ఎంఆర్ఐ స్కానింగ్స్ లాంటి వాటి ధరలు పెరుగుతాయన్న భయాలు వెంటాడుతున్నాయి. వాటితోపాటు వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన డ్రిప్​ పరికరాలు, పీవీసీ పైపులు, ఇతరత్రాల ధరలూ పెరుగుతాయన్న వార్నింగ్​ బెల్స్​ మోగుతున్నాయి. 

పెరిగిన రవాణా, ముడి సరుకు ధరలు..

ఫార్మా పరిశ్రమతోపాటు పాలిమర్​ బేస్డ్​ ఇండస్ట్రీలకు భారీ దెబ్బ పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో ఔషధాల తయారీకి పెట్రోకెమికల్స్​ నుంచి తయారు చేసే పాలిమర్స్​ (పాలిఇథిలీన్​, పాలిప్రొపిలీన్), సాల్వెంట్స్​, యాక్టివ్​ ఫార్మా ఇంగ్రెడియెంట్స్​ (ఏపీఐ) అత్యంత కీలకం. కానీ, హార్మూజ్​ జలసంధి మూసుకుపోవడంతో వాటి దిగుమతి చాలా వరకు తగ్గిపోయింది. క్రూడ్​ ఆయిల్​ నుంచే పెట్రో కెమికల్స్​, వాటి నుంచి పాలిమర్స్‌‌‌‌ను తయారుచేస్తుంటారు. 

కానీ, క్రూడ్​ ఆయిల్​ దిగుమతులు తగ్గడంతో పెట్రోకెమికల్స్​ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. సాల్వెంట్స్​ ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఈ క్రమంలోనే దేశీయంగా వాటి ధరలు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయని ఇండస్ట్రీల ప్రతినిధులు చెబుతున్నారు. దానికి తోడు షిప్పింగ్​ కష్టాలు కూడా వెంటాడుతున్నాయి. హార్మూజ్​ మూసివేత దెబ్బకు.. రెడ్​ సీ మార్గంలో ప్రయాణించేందుకు సైతం  నౌకాయాన సంస్థలు జంకుతున్నాయి. దీంతో సర్​చార్జీలను 4 వేల డాలర్ల నుంచి 8 వేల డాలర్ల దాకా పెంచారని ఫార్మెక్సిల్​ గణాంకాలు చెబుతున్నాయి. 

ఇటు తయారు చేసిన మందుల షిప్పింగ్‌‌‌‌కూ ఇబ్బందులు తప్పడం లేదు. కోల్డ్​ చైన్‌‌‌‌​ సప్లైస్​పైనా ఎఫెక్ట్​ పడింది. పలు ఔషధాలను శీతల పరిస్థితుల్లో స్టోర్​ చేసి తరలించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు దానికీ ఇబ్బందులవుతున్నాయి.  క్రూడాయిల్​ ధరలు పెరగడంతో పలు దేశాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలూ పెరిగాయి. దీంతో రవాణా ఖర్చులు పెరిగాయి.   

వ్యవసాయంపైనా ఎఫెక్ట్​..

యుద్ధం ప్రభావం ఫార్మా ఇండస్ట్రీకే కాదు.. గ్యాస్​ ఆధారిత ఇతర పరిశ్రమలపైనా పడిందని నిపుణులు చెబుతున్నారు. పలు పరిశ్రమలు పాలిమర్​ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కీలకమైన పీవీసీ పైపులు, ఎలక్ట్రికల్​ ఉత్పత్తులు, డ్రిప్​ ఇరిగేషన్‌‌‌‌కు సంబంధించిన పరికరాల ముడిసరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయని ఇండస్ట్రీ వర్గాల ప్రతినిధులు చెబుతున్నారు. ఇటు విద్యుత్​ స్విచ్​ బోర్డులకు కావాల్సిన హెచ్​డీసీ ప్లాస్టిక్స్​ ధరలూ పెరిగాయని అంటున్నారు.  

ప్రస్తుతం చాలా ఇండస్ట్రీలు ఇప్పటికే తమ కస్టమర్ల నుంచి పాత రేట్లకే ఆర్డర్స్​ తీసుకున్నాయి. కానీ, ఇప్పుడు ఇంపోర్ట్స్​ చార్జీలు పెరగడంతో పాత రేట్లకే డీల్స్‌‌‌‌ను క్లోజ్​ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌‌‌‌ను ఎక్కువగా వాడే గ్లాస్​ తయారీ పరిశ్రమలు, అల్యూమినియం వస్తువుల తయారీ పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం పడింది. 

ఎంఆర్ఐ యంత్రాలపై ఎఫెక్ట్ 

ఆసుపత్రులు, డయాగ్నస్టిక్​ సెంటర్లపైనా యుద్ధం ప్రభావం పడింది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్​ యంత్రాలకు సంబంధించి వాడే హీలియం గ్యాస్​ సప్లై తగ్గిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎంఆర్ఐ స్కానింగ్​ యంత్రాల నుంచి వచ్చే రేడియేషన్​తగ్గించేందుకు ఆ పరికరాల్లోని మ్యాగ్నెట్స్‌‌‌‌ను కూలింగ్​ చేయడం కోసం హీలియం గ్యాస్​ వాడుతారు. ఆ హీలియం గ్యాస్‌‌‌‌ను ఖతార్​ నుంచే ఇక్కడి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దాదాపు 40 శాతం హీలియం ఎగమతులు ప్రపంచ దేశాలకు ఖతార్​ నుంచే జరుగుతుంటాయి. కానీ, ఇప్పుడు ఆ హీలియం గ్యాస్​ సరఫరా తగ్గిపోయింది. ఇప్పుడున్న నిల్వలూ మహా అయితే మరో 15 రోజులు వస్తాయని ఇండస్ట్రీస్​ ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాగైతే ఎంఆర్ఐ స్కానింగ్​ ధరలూ పెరిగే ప్రమాదముంటుందని చెబుతున్నారు. 

సామాన్యులపై ఎఫెక్ట్​ పడే ప్రమాదం

ప్రస్తుతానికి ముడిసరుకు ధరలు పెరుగుతున్నా.. సామాన్యులకు ఇబ్బందైతే ఏమీ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ధరాభారాన్ని ప్రజలకు ట్రాన్స్‌‌‌‌ఫర్​ చేయలేదంటున్నాయి. కానీ, మరో 15 నుంచి నెల రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం మాత్రం కచ్చితంగా ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత ఆవశ్యక ఔషధాలైన యాంటీ బయాటిక్స్​, జ్వరం, నొప్పి మందులు, విటమిన్స్ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

దీర్ఘకాలంలో ఇలాగే కొనసాగితే సంస్థలు ఆ భారాన్ని భరించలేవని, కచ్చితంగా ప్రజలపై ఆ ఎఫెక్ట్​ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ధరలు ఎంత మేర పెంచుతారన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్​, ఒమన్​, యెమన్​, కువైట్‌‌‌‌లాంటి దేశాలకు మన దగ్గర్నుంచే ఔషధాల ఎగుమతులు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ, ఇప్పుడు ఆ ఎక్స్‌‌‌‌పోర్ట్స్​ కూడా ఆగిపోయాయని నిపుణులు చెబుతున్నారు. 

రవాణా ఖర్చులు పెరిగినయ్​

ఇరాన్​ యుద్ధం ప్రభావం గ్యాస్​, పాలిమర్​ బేస్డ్​ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. పీవీసీ, హెచ్​డీసీ, ప్లాస్టిక్​ పైపుల పరిశ్రమల ముడిసరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. ఇటు ఫార్మా పరిశ్రమల ముడిసరుకుల రేట్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ ఎఫెక్ట్​ ఇప్పటికిప్పుడు ప్రజలపై ఉండకపోయి నా.. భవిష్యత్​లో ఇలాగే కంటిన్యూ అయితే ధరలు పెంచే పరిస్థితి రావొచ్చు. ముఖ్యంగా వ్యవసాయానికి అత్యంత కీలకమైన పరికరాల ధరలు పెరిగే చాన్స్​ ఉంటుంది. మందుల ధరలూ పెరిగే ప్రమాదం లేకపోలేదు. పెట్రోల్​, డీజిల్​, సీఎన్‌‌‌‌జీలాంటి వాటి రేట్లపెంపుతో ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్​ చార్జీలూ పెరుగుతున్నాయి. ఇంపోర్ట్స్​, ఎక్స్‌‌‌‌పోర్ట్స్​ తగ్గిపోవడంతో.. ముడిసరుకుల ధరలు పెరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలపైనా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 

- సుధీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ప్రెసిడెంట్​, 

తెలంగాణ ఇండస్ట్రీస్​ ఫెడరేషన్​