డ్యూయల్​ సిమ్​కు దూరమవుతున్న కస్టమర్లు

డ్యూయల్​ సిమ్​కు దూరమవుతున్న కస్టమర్లు

పెరుగుతున్న డేటా, వాట్సాప్‌ కాల్స్ 

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: జియో, ఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్ ఐడియా (వీ) ల చుట్టూనే మన టెలికం సెక్టార్‌‌‌‌ తిరుగుతోంది.  ఇందులో రెండు నెట్‌‌వర్క్‌‌లు భారీగా కస్టమర్లను కోల్పోతున్నప్పటికీ, మరొక నెట్‌‌వర్క్‌‌ అంతే స్థాయిలో కస్టమర్లను ఆకర్షించలేకపోతోంది. అంటే చాలా మంది కస్టమర్లు మరొక కొత్త నెట్‌‌వర్క్‌‌లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. ఎయిర్‌‌‌‌టెల్ నెట్‌‌వర్క్ ఈ ఏడాది మే నెలలో 46.13 లక్షల మంది కస్టమర్లను, వొడాఫోన్ ఐడియా 42.8 లక్షల మంది కస్టమర్లను కోల్పో యాయి. మరోవైపు జియో మాత్రం 35.54 లక్షల మంది కస్టమర్లనే యాడ్ చేసుకోగలిగింది. రెండు పెద్ద నెట్‌‌వర్క్‌‌లు సుమారు 88 లక్షల మంది కస్టమర్లను కోల్పోగా, జియోకి యాడ్ అయ్యింది అందులో సగం కూడా లేదు. అంటే సబ్‌‌స్క్రయిబర్లు తమ నెట్‌‌వర్క్‌‌ నుంచి బయటకొచ్చేసినా కొత్త నెట్‌‌వర్క్‌‌కు యాడ్‌‌ కావడం లేదనే విషయం అర్థమవుతోంది. ఈ ఏడాది మే నెలలో ఇండియన్ టెలికం మార్కెట్‌‌ ఏకంగా 62.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయిందని ట్రాయ్ డేటా చెబుతోంది.  కిందటేడాది ఏప్రిల్‌‌లో టెలికం ఇండస్ట్రీ ఏకంగా 82 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఆ టైమ్‌‌లో జియో, ఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్ ఐడియా కస్టమర్లు కూడా తమ నెట్‌‌వర్క్ నుంచి బయటకొచ్చేశారు. అంటే ఆ నెట్‌‌వర్క్ సిమ్‌‌ను వాడకుండా పడేస్తున్నారు.

కారణమేంటి?

గత ఏడాది కాలం నుంచి టెలికం ఇండస్ట్రీలో అనేక మార్పులొస్తున్నాయి. స్మార్ట్‌‌ఫోన్లు వచ్చిన స్టార్టింగ్‌‌లో డ్యూయల్‌‌ సిమ్‌‌ల ట్రెండ్ బాగా కొనసాగింది. చాలా మంది తమ ఫోన్‌‌లో రెండు సిమ్‌‌లను  మెయింటైన్ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఈ  పరిస్థితులు మారినట్టు కనిపిస్తోంది. రెండు సిమ్‌‌ల కంటే ఒక సిమ్‌‌ను మెయింటైన్ చేయడం ఈజీగా భావిస్తున్నారు. గతంలో ఒక జీబీ డేటా కాస్ట్ కూడా తక్కువగా ఉండేది. అంతేకాకుండా సిమ్‌‌కు ప్రతీ నెల మినిమమ్ రీఛార్జ్ చేయకపోయినా, ఇన్‌‌కమింగ్ కాల్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడలా లేదు. సిమ్‌‌కి ఇన్‌‌కమింగ్ కాల్స్ రావాలంటే కచ్చితంగా మినిమమ్‌‌ ప్లాన్‌‌తో రీఛార్జ్ చేయాల్సిందే. ఇలా అవసరం లేని సిమ్‌‌కి కూడా  ప్రతి నెలా రీఛార్జ్‌‌ చేయడం కస్టమర్లను ఇబ్బంది పెడుతోంది. అసలే కరోనా వలన ప్రజల ఆర్థిక పరిస్థితులు తగ్గిపోయాయి. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకునేందుకు కస్టమర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దగ్గర్లోని టెలికం కంపెనీల స్టోర్‌‌‌‌కి వెళ్లి సిమ్‌‌ కార్డును డీయాక్టివేట్ చేసుకోవడం కూడా ఈజీగా మారింది.    దీంతో అనవసర సిమ్‌లను వదిలించుకుంటున్నారు.

అడ్వాన్స్ టెక్నాలజీ..
టెలికం ఇండస్ట్రీలో టెక్నాలజీ అడ్వాన్స్ అవుతోంది. ఒకప్పుడు 2జీ, 3జీ నెట్‌‌వర్క్‌‌లు కనిపించేవి. ఇప్పుడు  ఎక్కుడ చూసినా 4 జీనే. వోల్ట్‌‌ కాల్స్‌‌కు పెరిగాయి. ఇంటర్నెట్‌‌తో కాల్స్ అవుతున్నాయి. కానీ, చాలా స్మార్ట్‌‌ఫోన్లలో ఒక సిమ్‌‌ స్లాట్‌‌కే వోల్ట్‌‌ ఫెసిలిటీ ఉంటోంది. దీంతో రెండు సిమ్‌‌ కార్డులు ఉన్న ఫోన్‌‌లోనూ ఒక సిమ్‌‌నే వాడుతున్నారు కస్టమర్లు. దీనికి తోడు వైఫై కాలింగ్ ఫెసిలిటీ రావడం, వాట్సాప్ కాలింగ్‌‌, ఇతర మెసేజింగ్ కాల్స్‌‌ పాపులర్ అవ్వడం కూడా టెలికం నెట్‌‌వర్క్‌‌లు కస్టమర్లు కోల్పోవడానికి ఒక విధంగా కారణమవుతున్నాయి. ఎందుకంటే  ఈ కాల్స్ చేసుకోవడం సులభం. ఇంకా వీటి కోసం రెండు మూడు సిమ్‌‌ కార్డులను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దేశంలో బ్రాడ్‌‌బ్యాండ్ సర్వీస్‌‌లు కూడా పెరుగుతున్నాయి. దీంతో  ఇంటర్నెట్ కనెక్షన్‌‌ ఈజీగా అందుతోంది.

జియోనే టాప్‌‌..
టెలికం నెట్‌‌వర్క్‌‌లో జియో టాప్ పొజిషన్‌‌లో ఉంది. ఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్ ఐడియాల కస్టమర్లు ఈ ఏడాది మే నెలలో తగ్గినా, జియో కస్టమర్లు మాత్రం పెరిగారు. వరసగా నాలుగు నెలల్లోనూ జియోకి కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. మే నెల చివరి నాటికి జియో కస్టమర్ల బేస్‌‌ 43.12 కోట్లకు చేరుకుంది. ఎయిర్‌‌‌‌టెల్‌‌ కస్టమర్ల బేస్‌‌ మాత్రం 34.8 కోట్లకు తగ్గింది. వొడాఫోన్ ఐడియా కస్టమర్ల బేస్‌‌ 27.7 కోట్లుగా ఉంది. దేశంలోని మొత్తం మొబైల్ సబ్‌‌స్క్రయిబర్ల సంఖ్య మే నెలలో 62.7 లక్షలు తగ్గి 116.3 కోట్లుగా ఉంది.