ఫోన్ హ్యాంగ్ .. సర్వర్ డౌన్!

ఫోన్ హ్యాంగ్ .. సర్వర్ డౌన్!
  • చేయూత పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు
  • సిబ్బంది పాత ఫోన్లలో  సపోర్ట్ చేయని యాప్ 
  • పది సార్లు తీసినా ఐరీస్ క్యాప్చర్ కావట్లేదు
  • ఆలస్యమవుతుండగా లబ్ధిదారులు బారులు 

యాదాద్రి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూత పింఛన్ల పంపిణీలో ఫేస్​రికగ్నిషన్​(ముఖ గుర్తింపు) లో సమస్యలు వస్తున్నాయి. ఫోన్లు పాతవి కావడం, యాప్​కు సపోర్టింగ్​చేయలేక హ్యాంగ్​అవుతున్నాయి. దీంతో అధికారులతో పాటు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల మంది చేయూత పింఛన్లు చెల్లిస్తుండగా.. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలిసిస్‌ బాధితులు ఉన్నారు. 

ఇందులో 23 లక్షల  మంది బయోమెట్రిక్‌ ద్వారా పింఛన్లు అందుకుంటున్నారు. మరో 21లక్షల మందికి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ డబ్బులు జమ అవుతున్నాయి.  అయితే బయోమెట్రిక్‌ ద్వారా పింఛన్లు​ పొందే లబ్ధిదారుల్లో కొందరికి వేలి ముద్రలు సరిగా పడడం లేదు. అలాంటి వారికోసం ప్రత్యేకంగా నియమించిన అధికారులు పింఛన్ డబ్బు నొక్కేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  దీంతో బయోమెట్రిక్​పద్ధతిని ప్రభుత్వం బంద్ పెట్టింది. 

ఈనెల నుంచే ముఖ గుర్తింపు(ఫేసియల్‌ రికగ్నిషన్‌) విధానాన్ని సెర్ఫ్​ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)అమలు చేస్తోంది. ఇందుకు‘ చేయూత మొబైల్ యాప్​’ ను అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీసులు, పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ చేసి సిబ్బందికి కొత్త 4 జీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని సెర్ప్ భావించింది. ఈనెల పింఛన్ల పంపిణీకి మాత్రం తమ స్మార్ట్​ఫోన్లలో యాప్ డౌన్​లోడ్ ​చేసుకుని లబ్ధిదారులకు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా అలానే చేస్తున్నారు.  

5  నుంచి 10 సార్లు ప్రయత్నిస్తుండగా..

ఫేస్​రికగ్నిషన్​ పద్ధతితో రెండు రోజులుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సిబ్బంది స్మార్ట్​ఫోన్లు పాతవి కావడంతో పాటు సర్వర్​డౌన్​ అవుతుంది. లబ్ధిదారుల ‘ఐరీస్’​ తీసుకునే క్రమంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి రెండు మూడు ప్రయత్నాల్లో ఐరీస్ క్యాప్చర్​ఓకే అవుతుండగా.. ఇలా చాలామందికి 5 నుంచి పదిసార్లు ప్రయత్నించాల్సి వస్తోంది. పింఛన్ లబ్ధిదారులు ఎక్కువ మంది అధిక వయసు వారే కావడంతో చాలాసేపు నిలబడలేకపోతున్నారు. ఐరీస్ క్యాప్చర్​చేయడానికి పింఛన్లు ఇచ్చే స్టాఫ్​కూడా లబ్ధిదారు లతో పాటు నిలబడాల్సి వస్తోంది. కనురెప్పలు కదిలించమని పలుమార్లు లబ్ధిదారులకు చెప్పాల్సి వస్తోంది. అటూ ఇటూ కదులమని, ముందుకు, వెనక్కి జరగమని చెప్తున్నారు. .దీంతో పింఛన్ల పంపిణీ లేట్ అవుతోంది. దీంతో లబ్ధిదారులు ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తుండడంతో బారులు తీరుతున్నారు. 

యాప్ సపోర్ట్ చేయకపోతుండగా.. 

పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది వద్ద ఉన్న ఫోన్లలో ఇప్పటికే వారికి సంబంధించిన వివిధ రకాలు యాప్స్​ఉన్నాయి. దాదాపు అందరివి  పాత ఫోన్లే. దీనికి తోడు 4జీ ఫోన్లు లేకపోవడంతో చేయూత​యాప్​ సరిగా సపోర్ట్​చేయడం లేదు. మరోవైపు వెలుతురు సరిగా లేకపోవడంతో ఐరీస్ ​క్యాప్చర్​కావడం లేదు. ఫోన్లలో ఎక్కువ యాప్స్​ఉండడం కారణంగా హ్యాంగ్​ అవుతున్నాయి. దీంతో మళ్లీ మొదటి నుంచి ప్రయత్నించాల్సి వస్తోంది. అదేవిధంగా  కొందరి ఆధార్​మ్యాచ్​ కాకపోవడం, మరికొందరికి బయోమెట్రిక్​ సరిపోలకపోవడంతో పింఛన్​ పొందలేకపోతున్నారు. 

వచ్చే నెలలో కొత్త ఫోన్లు అందిస్తాం 

చేయూత పింఛన్ల పంపిణీ కోసం      కొత్త విధానం ఫేస్​రికగ్నిషన్​అమలు చేస్తున్నాం. ఇందుకు అందుబాటులోకి తెచ్చిన ‘చేయూత యాప్'లో ఏదైనా సమస్య ఏర్పడితే  ‘ మంత్ర డివైస్​’  డౌన్​లోడ్​చేసుకొని బయోమెట్రిక్​ద్వారా పింఛన్​ పంపిణీ చేయవచ్చు. వచ్చే నెలలో కొత్త స్మార్ట్​ఫోన్లు అందిస్తామని యాదాద్రి జిల్లా డీఆర్డీవో - నాగిరెడ్డి తెలిపారు.