
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. ఓ చీటింగ్ కేసులో శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు మంగళవారం (మే 13) రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం అతడిని మేజిస్ట్రేట్ ఇంటికి తరలించారు పోలీసులు. కాగా, అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కి రూ.6 కోట్లు మోసం చేశారని శ్రవణ్ రావుపై సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. కంపెనీకి సరుకు సరఫరా చేయకుండానే శ్రవణ్ రావు డబ్బులు తీసుకున్నారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న శ్రవణ్ రావుకు.. రూ.6 కోట్ల ఫ్రాడ్ కేసులో మంగళవారం (మే 13) విచారణకు రావాలని సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసుల మేరకు శ్రవణ్ రావు మంగళవారం విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం శ్రవణ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఇంటికి తరలించారు.
ఫోన్ ట్యాపింగ్ సమయంలో రెండు సెల్ ఫోన్లు..!
గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నంబర్లు.. వాటిని ప్రణీత్ రావు టీమ్‌కు పంపించిన మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా.. ట్యాపింగ్‌లో శ్రవణ్ రావు పాత్రను సిట్ అధికారులు గుర్తించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా ఫోన్ నంబర్లతో లింకైన ఐఎంఈఐ నంబర్లు గుర్తించారు. వీటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు నంబర్ నుంచి వెళ్లిన వాట్సాప్ చాటింగ్‌లు, ప్రణీత్ రావుకు ఆయన పంపించిన మొబైల్ నంబర్లను గుర్తించి శ్రవణ్ రావుపై కేసు నమోదు చేసింది సిట్.
సిట్ కేసు నమోదు చేయగానే విదేశాలకు పారిపోయిన శ్రవణ్ రావు ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. పూర్తిస్థాయిలో సిట్ విచారణకు సహకరిస్తానని కోర్టుకి చెప్పాడు.
చెప్పినట్లుగానే సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు.. పోలీసులకు మాత్రం సహకరించడం లేదు. దీంతో శ్రవణ్ రావు బెయిల్ రద్దు చేయాలని మే 5న సిట్ సుప్రీంకోర్టును కోరింది. విచారణకు సహకరించడం లేదని.. బెయిల్ రద్దు చేసి కస్టడీకి అప్పగించాలని రిక్వెస్ట్ చేసింది సిట్. ఇంతలోనే శ్రవణ్ రావు చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు.