
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు.
అప్పటి మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో 2023 అక్టోబర్, నవంబర్ నెలల్లో మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావు ప్రభాకర్ రావుతో డైరెక్ట్ కాంటాక్ట్ లోకి వచ్చారని కస్టడీ విచారణలో భాగంగా భుజంగరావు దర్యాప్తు బృందానికి వెల్లడించారు. శ్రవణ్ వాట్సాప్ ద్వారా కాంగ్రెస్, బీజేపీ నేతల మద్దతుదారులు, ఫైనాన్షియర్ల వివరానలు తమకు పంపించేవాడని. డబ్బు రవాణాకు సంబంధించి స్పష్టమైన సమాచారం అతని ద్వారా రావడంతో దాన్ని సీజ్ చేసేవాళ్లమని అట్లాగే బీఆర్ఎస్ వ్యతిరేకులను ట్రోల్ చేయడంలో శ్రవణ్ .. ప్రణీత్ కు సహకరించేవాడని చెప్పారు.
డీజీపీ, ఏడీజీపీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా ఏ నంబర్లను టాప్ చేస్తున్నారని రివ్యూ చేసి తెలుసుకునే అవకాశం లేదు. దీంతో ఈ అలుసుతోనే ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ స్వేచ్ఛగా ట్యాపింగ్ చేసేవారని భుజంగరావు చెప్పారు . ఈ కారణం వల్లే ఇప్పుడు మొత్తం పోలీసు వ్యవస్థనే తప్పుబట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
ప్రణీత్ రావు ప్రత్యేకంగా కేఎంఆర్ అనే వాట్సాప్ గ్రూప్ నిర్వహించినట్లు తనకు తెలిసిందని భుజంగరావు తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీచేసిన వెంకటరమణారెడ్డి, రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డిపై నిఘా సమాచారం కోసమే ఈ గ్రూప్ పెట్టారన్నారు. ఇంత మానిటర్ చేసినా కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడం తమకు షాకింగ్ అని చెప్పుకోచ్చారు.
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో విపక్ష నేతల మనీ యాక్టివిటీపై నిఘా కోసం పోల్ 2023 పేరుతో మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని చెప్పారు భుజంగరావు. ప్రణీత్ టీమ్ విద్యార్థి నేతలు, కుల సంఘాల నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు (జస్టిస్ శరత్ కాజా లాంటివాళ్లు) అడ్వొకేట్లపైనా నిఘా ఉంచారు. వాళ్ల వ్యక్తిగత వివరాలు, యాక్టివిటీ తెలుసుకోవడం ద్వారా తగిన టైంలో వారికి కౌంటర్ ఇవ్వాలని భావించేవారు.
బీఆర్ఎస్ కు ఇబ్బంది అయిన ప్రతి సందర్భంలోనూ ఎస్వోటీ నిఘా కీలకంగా మారేది. ఈటల సస్పెన్షన్ సమయం, తర్వాత హుజురాబాద్ బైపోల్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకులపై విద్యార్థులనిరసనలు, లీకులపై కేటీఆర్ కామెంట్ల వివాదం, ఫాంహౌస్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసుల సమయంలో నేను కీలకమైన సమాచారం, వ్యక్తుల వివరాలను ప్రణీత్ టీమ్ కు ఇచ్చేవాడిని.