భద్రాద్రిలో పందులు చచ్చిపోతున్నయ్

భద్రాద్రిలో పందులు చచ్చిపోతున్నయ్

భద్రాచలం, వెలుగు: నాలుగురోజుల్లో 200కు పైగా పందులు చనిపోయాయి. పట్టణంలోని పలు కాలనీల్లో ఎక్కడికక్కడ కడుపు ఉబ్బి పడిపోతున్నాయి. ఇళ్ల మధ్యలో చనిపోయి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో పంచాయతీ ట్రాక్టర్లలో వాటిని తరలిస్తున్నారు. అంతుపట్టని రోగం వచ్చి  చనిపోయినట్లు యజమానులు చెబుతున్నారు. కాగా వీరంతా భద్రాచలం పట్టణంలోని వివిధ హోటళ్లలో మిగిలిన ఆహార పదార్ధాలు, కుడితి తీసుకొచ్చి పెడుతున్నారు. 

రోజుల తరబడి నిల్వ ఉండి, ప్లాస్టిక్​ వస్తువులు కూడా కలుస్తుండటంతో వాటికి కడుపులో ఇన్​ఫెక్షన్​ సోకి చనిపోయాయని అంటున్నారు. పట్టణంలో డంపింగ్​ యార్డు లేకపోవడంతో పందుల కళేబరాలను గోదావరి కరకట్టపై డంప్​ చేస్తున్నారు. దీంతో భక్తులు, వాకింగ్​కు వచ్చే స్థానికులు వాసనతో ఇబ్బంది పడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో శ్రీరామనవమి, రాములోరి పట్టాభిషేకం ఉన్నాయి.  భక్తులు ఈ కరకట్టపైనే సేదతీరి, గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఉత్సవాలు తిలకించేందుకు వెళ్తారు. ఈ వాసన భక్తులకు కూడా ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. నాలుగు రోజుల్లో 200 పైగా పందులు చనిపోవడంతో రూ.50 లక్షల వరకు నష్టం వచ్చిందని యజమాని సాంబ తెలిపాడు. కాగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని పశు వైద్యాధికారి డా.జగదీశ్​ తెలిపారు.