అలహాబాద్: ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల్లో 99 మందిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని ఫతేపూర్ జిల్లాకు చెందిన భారతి దేవి అనే మహిళ దాఖలు చేశారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ‘ఘర్ ఘర్ గ్యారంటీ స్కీమ్’ ప్రకటించిందని.. ఈ స్కీంలో భాగంగా ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రజలకు హామీ ఇచ్చారని పిటిషనర్ గుర్తుచేశారు. ఈ స్కీంను ప్రకటించి ఓటర్లను నమ్మబలికి 99 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలుపొంది పార్లమెంట్కు వెళ్లారని, ఆ 99 మందిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ‘ఘర్ ఘర్ గ్యారంటీ స్కీమ్’ ప్రకటించి ఓటర్లకు డబ్బు ఆశచూపడమంటే.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951ని ఉల్లంఘించడమేనని ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్ చెప్పుకొచ్చారు.
‘ఘర్ ఘర్ గ్యారంటీ స్కీమ్’లో భాగంగా ఓటర్లను వంచించడానికి గ్యారంటీ కార్డ్స్ కూడా పంచారని తెలిపారు. ఎన్నికల సంఘం పారదర్శకతను దెబ్బతీసేలా ఈ స్కీంను ప్రకటించి.. ఓటర్లను నమ్మించి ఓట్లు దక్కించుకున్న 99 మంది కాంగ్రెస్ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ భారతి దేవి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. 99 మంది ఎంపీలపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఇంత జరుగుతున్నా కేంద్ర ఎన్నికల సంఘం అలసత్వంగా వ్యవహరించిందని ఈసీ తీరును కూడా ఆమె తప్పుబట్టారు. సెక్షన్ 16A, ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారం కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని పిటిషనర్ ప్రజాహిత్య వ్యాజ్యంలో కోరారు. ఈ ప్రజాహిత్య వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు ఎలా స్పందిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
