పిలగాండ్లు: పిసినారిలో మార్పు

పిలగాండ్లు: పిసినారిలో మార్పు

గోవిందయ్య మహా పిసినారి. అతనికి నా అన్న వారు ఎవరూ లేరు. అతడు తన దగ్గరున్న డబ్బంతా తన ఇంట్లోనే పెట్టుకునేవాడు. దాన్ని చూసి తెగ మురిసిపోతుండేవాడు. ఆ డబ్బును దొంగలు ఎత్తుకు పోతారేమోనన్న భయం పట్టుకుంది. చివరకు అది ఆందోళనగా మారి తిండికి, నిద్రకు దూరమయ్యాడు. దాంతో కొన్ని రోజులకు అనారోగ్యం బారిన పడ్డాడు.

సరిగ్గా అప్పుడే ఆ గ్రామానికి ఒక స్వామీజీ వచ్చాడు. అందరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తుంటే గోవిందయ్య కూడా వాళ్లతో పాటు బయల్దేరాడు. అతడు స్వామీజీని దర్శించి తన పేరు చెప్పకుండా ‘‘స్వామీ! నా మిత్రుడి దగ్గర చాలా డబ్బు ఉంది. కానీ, తిండికి, నిద్రకూ దూరమై బాధపడుతున్నాడు. ఆరోగ్యం కూడా దెబ్బతింది. అతను మామూలు మనిషి కావడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి’’ అని అడిగాడు. అప్పుడే అక్కడ చెట్టు పైన ఉన్న రెండు చిలుకలు కిలకిలా రావాలు చేశాయి. 

స్వామీజీ కళ్ళు తెరిచి నవ్వి ‘‘నాయనా! నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ సమస్య నీదే! నాకు ఆ సంగతి ఈ చెట్టు పైన ఉన్న చిలుకలు చెప్తున్నాయి. నిజం చెప్పు. నాకు పక్షుల భాష వచ్చు’’ అన్నాడు. దాంతో గోవిందయ్య ‘మీరు చెప్పిందే నిజమే స్వామీ’ అని ఒప్పుకున్నాడు. అప్పుడు స్వామీజీ గోవిందయ్యతో ‘నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బును కొంత పేదవారికి, అనాధ శరణాలయానికి లేదా సత్రాలకు దానం చెయ్యి. నీకు మంచి జరుగుతుంది’ అని దీవించాడు. ‘సరేన’ని గోవిందయ్య తన ఇంటికి నడక సాగించాడు. దారిలో ఒక అన్న సత్రం కనిపించింది. 

ఆ అన్నసత్రానికి వెళ్లి భోజనం పెట్టమన్నాడు. కానీ, భోజనం వేళ అయిపోయింది. ఆకలికి తాళలేని గోవిందయ్యకు స్వామీజీ మాటలు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే అక్కడి వాళ్లతో ‘‘అయ్యా ! నాఆకలిని మీరు తీర్చండి. నేను మీకు ఎంతో కొంత సాయపడతా’’ అన్నాడు. అతని బాధ చూడలేక ఆ సత్రంలోని పనివాళ్లు వాళ్ల కోసం దాచుకున్న భోజనాన్ని అతనికి వడ్డించారు. గోవిందయ్య తృప్తిగా తిని ‘రేపు మా ఇంటికి రండి’ అని చెప్పాడు. మరుసటి రోజు సత్రం నిర్వాహకులు గోవిందయ్య ఇంటికి వెళ్లారు.

ఆ సత్రానికి కొంత డబ్బును విరాళంగా ఇచ్చాడు గోవిందయ్య. అది వాళ్లకి పెద్ద మొత్తంగా కనిపించింది. వాళ్లు ఊరి వారందరికీ గోవిందయ్య గురించి చెప్పారు. ఆ సాయంత్రం చాలామంది గ్రామస్తులు ఇంటికి వచ్చి గోవిందయ్యను అభినందించారు. మరి కొద్ది రోజులకు కొందరు పేదవారు గోవిందయ్యను సాయం అడిగారు. వాళ్లకి కూడా లేదనకుండా కొంత డబ్బు ఇచ్చాడు.

ఆ రాత్రి గోవిందయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ దొంగలు గోవిందయ్యను నిద్రలేపి ‘‘నీ వద్ద చాలా డబ్బు ఉందని విన్నాం. మాకు ఆ డబ్బంతా ఇచ్చెయ్యి’’ అని బెదిరించారు. ఇంతలో ఊరి జనం కేకలు వినిపించి ఆ దొంగలు పారిపోయారు. ఊరి జనం గోవిందయ్య ఇంట్లోకి వచ్చి ‘‘ఆ దొంగలు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా” అని ఆదుర్దాతో అడిగారు. 

తన డబ్బుని కాపాడటానికి అంత మంది జనం పరుగెత్తి రావడం చాలా ఆనందం కలిగించింది గోవిందయ్యకు. దాంతో తన దగ్గర ఉన్న సంపదలో సగానికి పైగా అందరికీ దానం చేసి గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. కొన్ని రోజులకు గ్రామ ప్రజలు గోవిందయ్యనే గ్రామాధికారిగా ఎన్నుకున్నారు. స్వామీజీ పుణ్యమా అని పిసినారి గోవిందయ్య దాతగా మారి కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య