16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్, మర్డర్.. 35 మంది అరెస్ట్

16 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్, మర్డర్.. 35 మంది అరెస్ట్

గత వారం యూపీలోని పిలిభిత్‌ జిల్లాలో 16 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్, మర్డర్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 35 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును మొత్తం 12 టీమ్‌లు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నాయని ఏడీజీ అవినాశ్ చంద్ర తెలిపారు. ఇప్పటికే 35 మందిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అయితే తమ బిడ్డకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బాధిత బాలిక కుటుంబం డిమాండ్ చేస్తోంది.

స్కూల్‌కు వెళ్లిన బాలికపై ఘోరం..

యూపీలోని పిలిభిత్ జిల్లా బర్ఖెరా సమీపంలోని ఓ గ్రామంలో గత శనివారం ఈ ఘటన జరిగింది. ఆ రోజు ఉదయం ఇంటి నుంచి 16 ఏండ్ల బాలిక తన సైకిల్‌పై స్కూల్‌కు వెళ్లింది. రోజూ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి తిరిగి వచ్చేంది. కానీ ఆ రోజు రాత్రి అయినా ఆ బాలిక ఇంటికి చేరలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటి నుంచి సుమారు అర కిలోమీటరు దూరంలో అర్ధ నగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ పరిసరాల్లో సైకిల్, స్కూల్‌ బ్యాగ్, బీరు బాటిళ్లు కనిపించాయి. తమ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేసి చంపేశాని ఆ బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని డెడ్‌బాడీని పోస్టుమార్టానికి తరలించారు. ఆ తర్వాతి రోజు మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించగా, అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఐదు రోజులవుతున్నా పోలీసులు ఇంకా అసలు నిందితులు ఎవరన్నది తేల్చలేదని, తమ బిడ్డకు త్వరగా న్యాయం జరగాలంటే కేసు సీబీఐకి అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఆ కుటుంబాన్ని పరామర్శించి, వాళ్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. సమాజ్‌వాదీ పార్టీ నేతలు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, దీనికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత జాఫర్ అలీ నఖ్వీ అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తనను పంపారని, ప్రభుత్వం త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.