వరద సాయాన్ని ఆపడంపై హైకోర్టులో పిల్

వరద సాయాన్ని ఆపడంపై హైకోర్టులో పిల్

నోటిఫికేషనప్పుడు లేని అభ్యంతరం
24 గంటల్లో ఎట్ల వచ్చింది?

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసినప్పుడు వరద సాయంపై అభ్యంతరం చెప్పకుండా తర్వాత 24 గంటల్లోపే ఆపాలని స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ పేర్కొనడాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పేరుతో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయొద్దని రాష్ట్రానికి ఎస్‌ఈసీ లెటర్‌ రాయడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రీరాంభట్ల శరత్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. పిల్‌ను అత్యవసరంగా విచారణ చేయాలని కోరారు. కేసును సోమవారం విచారిస్తామని హైకోర్టు చెప్పింది.

‘వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున చెల్లించాలని  సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున చెల్లింపులు నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఈ నెల 18న రాష్ట్రానికి లెటర్‌ రాసింది. ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడించేప్పుడు లేని అభ్యంతరం 24 గంటల్లోనే ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు.  మానవీయ కోణంలో చూస్తే ఎస్‌ఈసీ నిర్ణయం సరి కాదు. చట్ట ప్రకారం కూడా విపత్తులు వచ్చినప్పుడు సాయం చేయొద్దనడం చెల్లదు. ఎస్‌ఈసీ ఆదేశాల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలి. ఎస్‌ఈసీ లెటర్‌ చెల్లదని ప్రకటించాలి’ అని పిటిషనర్‌ కోరారు.