
తన సినిమాలో కామెడీ, డ్రామా,ఎమోషన్, రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్ లాంటివన్నీ ఉన్నాయి.. కానీ డైలాగ్స్ మాత్రం లేవు అంటున్నారు దర్శకుడు జి అశోక్. పిల్ల జమిందార్, భాగమతి లాంటి చిత్రాలతో మెప్పించిన అశోక్ హిందీలో రూపొందించిన చిత్రం ‘ఉఫ్ యే సియప్పా’. కమల్ హాసన్‌తో సింగీతం తెరకెక్కించిన ‘పుష్పక విమానం’ తరహా మూకీ సినిమా ఇది. ఈ సైలెంట్ కామెడీ థ్రిల్లర్‌కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కథ విషయానికొస్తే.. కేసరి లాల్ సింగ్ (సోహుమ్ షా) ఒక సామాన్య ఉద్యోగి. పొరిగింటి కామిని (నోరా ఫతేహి)తో ఎఫైర్ ఉందని భార్య పుష్ప ‘(నుష్రత్ భరుచ్చ) అతన్ని విడిచిపెట్టి వెళుతుంది.
ఆ సమస్యను క్లియర్ చేసుకునేలోపు తప్పుగా డెలివరీ చేయబడ్డ ఓ డ్రగ్ పార్సిల్ వల్ల అతని జీవితం మరింత చిక్కుల్లో పడుతుంది. ఆ పార్సిల్‌ను వెతుక్కుంటూ అతని ఇంట్లో చొరబడ్డ అమ్మాయి డెడ్ బాడీ ఉండడం, దాన్ని మాయం చేసేలోపు మరో శవం కనిపించడంతో ఆ ఇల్లు పూర్తిస్థాయి క్రైమ్ స్పాట్‌గా మారుతుంది.
మరోవైపు పోలీస్ ఆఫీసర్ హస్ముఖ్ (ఓంకార్ కపూర్) తన పర్సనల్ అజెండాతో అక్కడికి రావడం మరింత చిక్కుల్లో పడేస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి కేసరి లాల్ సింగ్ ఎలా బయటపడ్డాడు అనేది మిగతా కథ. ట్రైలర్‌లో క్రైమ్, కామెడీని బ్లెండ్ చేసిన విధానం ఆకట్టుకుంది. లవ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.