అ‘భళా’..!  గగన తలంలో ‘స్వాతి’ కిరణం

అ‘భళా’..!  గగన తలంలో ‘స్వాతి’ కిరణం

ఆడజన్మ అంటనే ఎన్నో బాధలు.. మరెన్నో గాథలు.. ఏళ్లుగా వీడని వివక్ష అన్నింటా తానై నడుస్తున్నా.. ఇంకెన్నో అవరోధాలు.  వీటన్నింటి నీ ఎదురిస్తూ జిల్లా మహిళా మణులు ముందుకు సాగుతున్నారు. ఇంటా.. బయటా మేమే అన్నట్లు గా అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు. ఆకాశంలో సగం.. సమాజ నిర్మాణంలో మహోన్నతం.శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ దూసుకెళ్తున్నారు. పురుషుల కంటే తక్కువ కాదన్నట్లు గా ‘రాణి’స్తున్నారు. రంగమేదైనా విజయమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నారు. అందరితో జేజేలు అందుకుంటు న్నారు. శుక్రవారం అంతర్జా తీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళల ప్రత్యేకతలు.. విజయగాథలపై స్పెషల్‌ స్టోరీస్‌.

చిన్న నాటి కలను కొందరు మాత్రమే సాకారం చేసుకోగలుగుతారు. అలాంటి వారిలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన స్వాతి ఒకరు. బార్డర్ సినిమా చూసి పైలెట్ అవ్వాలని అనుకున్న ఆమె.. అకుంఠిత దీక్షతో కష్టపడి తన గమ్యాన్ని చేరుకున్నారు. శిక్షణ పొందిన చోటే ఇన్ స్ట్రక్టర్ గా రాణించి.. తెలంగాణలో తొలి మహిళా పైలెట్ గా రికార్డుకెక్కిన స్వాతి సక్సెస్‌ స్టోరీ ఇది.

ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్ కు చెందిన గంట మురళీధర్‍, శ్యామల కుమార్తె స్వాతి విద్య పట్టణంలోనే సాగింది. తండ్రి ఏఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమెకు సోదరి శ్రావణి, సోదరుడు సందీప్ ఉన్నారు. పట్టణంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమెను పైలెట్ రంగంలోకి వెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు.

మొదట పైలెట్ శిక్షణ కోసం హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ అకాడమీ (2006–-07) లో శిక్షణ పొందారు స్వాతి. త్వరగా శిక్షణ పూర్తి చేసుకునేందుకు ఫిలిప్పైన్స్ ఏవియేషన్ అకాడమీలో 2008లో కమర్షియల్ పైలెట్ గా పట్టా పొందారు. అప్పటి నుంచి ఫిలిప్పైన్స్ లోనే ఫ్లైట్‍ఇన్ స్ట్రక్టర్ గా, చార్టర్ పైలెట్ గా పనిచేశారు. గతేడాది ఏయిర్ బస్ శిక్షణ కోసం ప్రభుత్వం రూ. 25 లక్షల ఆర్థిక సాయం చేసింది. ఆ శిక్షణ ముగించుకుని వచ్చిన ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోని బేగంపేట్ విమనాశ్రయంలో జెట్ ఫ్లైట్‍ పైలెట్ గా పనిచేస్తున్నారు. భర్త ఉదయ్ కాంత్ నుంచి కూడా ఎంతో ప్రోత్సాహం ఉన్నట్లు ఆమె చెబుతున్నారు.

బార్డర్ సినిమా చూసి..

“ఏడో తరగతిలో ఉన్నప్పుడు బార్డర్ సినిమాలో యుద్ధ విమానాలను నడిపే పైలెట్లను చూసి అప్పుడే పైలట్ అవ్వాలనే కోరిక కలిగింది. ఆ తర్వాత మొదటిసారి ఫిలిప్పైన్స్ కు వెళ్లినప్పుడు.. ఎయిర్‍క్రాఫ్ట్ లో ఎక్కినప్పుడు ఎంతో ఆనందానికి లోనయ్యా. శిక్షణలో ఎయిర్‍క్రాప్టును మొదటిసారి పైకి తీసుకెళ్లినప్పుడు పలువురు వాంతులు చేసుకున్నా నేను భయపడలేదు. భారత్ లో పనిచేయాలన్న నా కోరిక ఎయిర్ బస్ శిక్షణతో తీరింది. శిక్షణలో అన్ని పరీక్షల్లో పాసై నాకు ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఐదు నెలల పాటు పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్ లో ఫ్లైట్ జెట్ గా పనిచేస్తున్నా. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో పైలెట్ గా వెళ్లేందుకు మహిళలెవరూ పెద్దగా ముందుకు రావడం లేదు. కొంత అవగాహన ఉన్నప్పటికీ సరైన కమ్యునికేషన్ స్కిల్స్ లేకపోవడంతోనే యువతులు ముందుకు రావడం లేదు. ఇలాంటి వారు డిఫెన్స్ అకాడమీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో మెరిట్‍ తెచ్చుకుంటే ఉచితంగా శిక్షణ పొం దవచ్చు. నేను పైలెట్‍ అయ్యేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఆర్థిక సాయం అందిం చిన ప్రభుత్వానికి రుణపడి ఉంటా” అని పైలట్ స్వాతి చెబుతున్నారు.