బియ్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ స్పష్టత

బియ్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ స్పష్టత

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ సర్కార్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీశాఖ‌ మంత్రి పీయూష్ గోయల్. ఎంపీ కేకే అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో సమాధానం చెప్పారు గోయల్. ఈ సీజన్ లో ఇప్పటికే జరిగిన అగ్రిమెంట్ ప్రకారం FCIకి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా.. రబీ గురించి ఇప్పుడే ఎందుకు ప్రస్తావన తెస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ ఏడాది కొనుగోళ్లు పెంచుతున్నామని... అగ్రిమెంట్ ప్రకారమే కేంద్రం కొనుగోళ్లు చేస్తోందన్నారు. పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని తెలంగాణ చెప్పిందని.. ఇప్పటి వరకు కేంద్రానికి ఇవ్వాల్సిన కోటానే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు పీయూష్ గోయల్. తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేక‌రించేందుకు కేంద్రం సుముఖంగా ఉందా లేదా అని కేశ‌వ‌రావు ప్ర‌శ్నించారు. దీనిపై మంత్రి పీయూష్ గోయ‌ల్ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌తి ఏడాది పంట సేక‌ర‌ణ‌ను క్ర‌మంగా పెంచుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దేశ‌వ్యాప్తంగా ధాన్య సేక‌ర‌ణ‌ను పెంచామ‌ని, తెలంగాణ‌లోనూ ప్రొక్యూర్మెంట్‌ను పెంచిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తెలంగాణ‌లో ఖ‌రీఫ్ సీజ‌న్‌లో 50 ల‌క్ష‌ల ట‌న్నులు ఇస్తామ‌ని చెప్పార‌ని, కానీ కేవ‌లం 32.66 ల‌క్ష‌ల ట‌న్నులు మాత్ర‌మే ఇచ్చార‌న్నారు.

  • కోటాను పెంచుతూ వస్తున్నాం

ర‌బీ సీజ‌న్‌లో ఎక్కువ‌గా బాయిల్డ్ రైస్ ఉంటుంద‌ని, ఒక‌వేళ మీరు బాయిల్డ్ రైస్ ప్రొక్యూర్ చేస్తే, ఎంత చేస్తారో చెప్పాల‌ని కేశ‌వ‌రావు ప్ర‌శ్నించారు.  (కేకే వెలుగు పేపర్ బ్యానర్ కాపీని చూపిస్తూ క్వశ్చన్ అడిగాడు). దీనిపై మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. ‘‘ఆయన (కేకే) వేరే స్టేట్ మెంట్లు ఏం చెబుతున్నారో నాకు తెలీదు. కొన్నేళ్లుగా ఏటా బియ్యం సేకరణలో సెంట్రల్ పూల్ కోటాను పెంచుతూ వస్తున్నాం. సెంట్రల్ పూల్ కోటాను 2018-19లో 443 లక్షల టన్నుల నుంచి 2020-21 ఏడాదికి 600 లక్షల టన్నులకు పెంచాం. తెలంగాణలోనూ 51 లక్షల టన్నుల నుంచి 74 లక్షల టన్నులకు, తర్వాత 94 లక్షల టన్నులకు పెంచాం. దీన్ని ఒప్పుకున్నందుకు టీఆర్ఎస్ సభ్యులకు ధన్యవాదాలు. ఇది మోడీ ప్రభుత్వం ట్రాక్ రికార్డు. అందుకే రైతుల ప్రయోజనాల విషయంలో మాది బాధ్యతగా పనిచేసే ప్రభుత్వం అని చెబుతుంటాం. అట్లాగే మద్దతు ధరకు ప్రభుత్వ చేసే కొనుగోళ్లను చాలా రెట్లు పెంచాం. తెలంగాణలో 2020-21 ఖరీఫ్ లో 50 లక్షల టన్నులు ఇస్తామని వాళ్లు చెప్పారు. కానీ చివరికి వాళ్లు 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇవ్వగలిగారు. తర్వాత రబీ సీజన్లో 55 లక్షల టన్నులు అంచనా చెప్పారు. కానీ వాళ్లు 61.87 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని చెప్పారు. వాళ్ల లెక్కల ఆధారంగానే మేం 94.53 లక్షల టన్నులు తీసుకోవడానికి అంగీకరించాం.

  • ఎప్పటిలాగే రైస్ కొనుగోళ్ల ప్రాసెస్ 

ఇదంతా వాళ్లు కొనుగోలు చేశామని చెప్పిన లెక్కే. కానీ ఈరోజుకు కూడా 29 లక్షల టన్నుల బియ్యం డెలివరీ ఇంకా పెండింగ్ లో ఉంది. మేం అంగీకరించిన క్వాంటిటీ బియ్యాన్ని కూడా వాళ్లు ఇవ్వలేకపోయారు. వాళ్లివ్వాల్సిందే ఇంకా పెండింగ్ లో ఉండగా తెలంగాణలో పదేపదే ఇదే రాజకీయం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా టీంలు గ్రౌండ్ లో వెరిఫికేషన్ కు వెళ్లినప్పుడు స్టాక్ లెక్కల్లో చాలా లోపాలు కనిపించాయి. స్టాక్ నిర్వహణలో ఏ మాత్రం నిబంధనలు పాటించట్లేదు. అయినా కూడా ప్రతినెలా మేం గడువును పొడిగిస్తూ వచ్చాం. ఈ విధంగా సాధ్యమైనంతగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చాం. ఇంత చేస్తున్నా మళ్లీ మళ్లీ దీనిపై రాజకీయం చేయడానికి కారణం ఏంటో నాకు తెలీదు. ఏళ్ల తరబడి రాష్ట్రాలతో ఎంవోయూ చేసుకోవడం, దాని ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతూనే వస్తోంది. రైస్ కొనుగోళ్ల ప్రాసెస్ ఎప్పటిలాగే కొనసాగుతోందని వ్యవసాయ మంత్రి కూడా సభలోనే స్పష్టంగా చెప్పారు. అయినా వాళ్లు మళ్లీ మళ్లీ అదే ప్రకటనను కొత్త ఫార్మాట్లో చెప్పాలని అడగడంలో అర్థం లేదు.’’

  • పద్ధతి ప్రకారమే పని జరుగుతుంది


‘‘ఈ సీజన్ లోనే వాళ్లు సప్లై చేస్తామని చెప్పిన బియ్యాన్ని ఇప్పటివరకు సప్లై చేయలేదు. ముందు చెప్పినదాన్ని పూర్తిచెయ్యమని మేం అడుగుతున్నాం. తెలంగాణ నుంచి ఇంకా 29 లక్షల టన్నుల సప్లై పెండింగ్ లో ఉంది. ముందు దీన్ని పూర్తిచెయ్యాలి. ఆ తర్వాత ఇంకేదైనా సమస్య ఉంటే ప్రభుత్వాన్ని అప్రోచ్ కావచ్చు. అప్పుడు ఎంవోయూ ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటాం. ఏళ్లతరబడి అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే పని జరుగుతుంది. మాకు తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలతో ఎంవోయూలు ఉన్నాయి. ఇది తెలంగాణతో చేసుకున్న ఎంవోయూ కాపీ. వాళ్లు దీన్ని కట్టుబడి రైస్ సప్లైని పూర్తిచేయాలి." అని తెలిపారు పీయూష్ గోయల్.