
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎలక్షన్లలో ఓటర్లు సీఎం కేసీఆర్ బిడ్డ కవితను ఓడించి గట్టి సిగ్నల్ ఇచ్చారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నా కూడా.. సీఎం కేసీఆర్, కేటీఆర్ కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి మత రాజకీయాలకు పాల్పడుతోందని, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం బాధాకరమని చెప్పారు. దానిని వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఇదే రోజున ( ఫిబ్రవరి 18న) పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాసైందని, రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. గత ఐదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందంటే.. అందుకు కేంద్రం అందిస్తున్న సహకారమే కారణమని చెప్పారు. తెలంగాణకు రైల్వే నిధులను రూ. 258 కోట్ల నుంచి రూ. 2,602 కోట్లకు పెంచిన ఘనత మోడీ సర్కార్ కే దక్కుతుందన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారని అభినందించారు. వాళ్లు ఏదడిగినా మంజూరు చేస్తున్నామన్నారు.
రాజ్యాంగాన్ని అవమానిస్తున్నరు
మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చే టీఆర్ఎస్ కు సీఏఏను వ్యతిరేకించే నైతిక హక్కు లేదని పీయూష్ గోయల్ అన్నారు. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. కేసీఆర్, ఓవైసీలు కలిసి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మెప్పు కోసమే కేసీఆర్ సీఏఏను వ్యతిరేకిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాసయ్యాక రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని న్యాయ నిపుణులు చెప్తున్నారని.. టీఆర్ఎస్ సర్కారు సీఏఏను వ్యతిరేకించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వచ్చి అన్ని రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని చెప్పారని.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ లలో మత హింసకు గురవుతున్న మైనార్టీలకు ఆశ్రయం ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
కేంద్ర పథకాలను ఎందుకు అమలు చేయట్లేదు?
కేంద్ర ప్రభుత్వం పేదల కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని పీయూష్ గోయల్ నిలదీశారు. ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదల కోసం తెచ్చిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కు 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
ఎన్నో కొత్త రైళ్లు ఇచ్చినం: కిషన్‌రెడ్డి
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్డీయే సర్కారు వచ్చిన తర్వాత ఇక్కడ రైల్వే సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని చెప్పారు. 48 కొత్త రైళ్లు వచ్చాయని, కొత్త లైన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైల్వేస్టేషన్లలో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
రైల్వేలైన్త్వరగా పూర్తి చేయాలి: బండి సంజయ్
కరీంనగర్‌ను హైదరాబాద్ తో అనుసంధానించే కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్‌ను త్వరగా పూర్తి చేయాలని పీయూష్ గోయల్‌కు ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు.