కేంద్రం ఒత్తిడితోనే తెలంగాణ సర్కార్ ఉచిత బియ్యం పంపిణీ

కేంద్రం ఒత్తిడితోనే తెలంగాణ సర్కార్ ఉచిత బియ్యం పంపిణీ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే జూన్ నుంచి తెలంగాణ సర్కార్ పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. తెలంగాణలో పీఎంజీకేఏవై స్కీం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ తీరును శుక్రవారం రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ లేవనెత్తారు. ఉద్దేశపూర్వకంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పీడీఎస్‌ను రాష్ట్రంలో అమలు చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో ఈ స్కీం అమలు కాకపోవడం నిజమైతే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై గోయల్ సమాధానం ఇస్తూ, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలాంటిది ఈ నెలలో జరిగిందని చెప్పారు. పీఎంజీకేఏవైను తెలంగాణ సర్కార్ అమలు చేయలేదన్నారు. ఐసీడీఎస్ స్కీంలో భాగంగా చిన్నారులకు, గర్భిణీ మహిళలకు కేంద్రం ఫెర్టిఫైడ్ (పోషకాలు కలిగిన ఆహారం) ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. ఈ స్కీం కింద తెలంగాణ సర్కార్ 24,180 టన్నుల లిఫ్ట్ చేయాల్సి ఉండగా, 6,544 టన్నులు మాత్రమే లిఫ్ట్ చేసిందన్నారు. అలాగే, పీఎం పోషణ్ స్కీంలో భాగంగా 16,499 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను కేటాయించినా, ఒక్క టన్ను కూడా ఇంత వరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదని కేంద్ర మంత్రి వివరించారు.