రైల్వే మంత్రికి కిడ్నీ స్టోన్స్ సర్జరీ

 రైల్వే మంత్రికి కిడ్నీ స్టోన్స్ సర్జరీ

రైల్వే మంత్రి పియూష్ గోయల్ కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో వాటిని తొలగించేందుకు సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ స్టోన్ రిమోవల్ సర్జరీకి చేయించుకోవాల్సి ఉందని, త్వరలోనే మళ్లీ విధులకు వచ్చేస్తానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన రైల్వే శాఖతో పాటు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. గత వారంలో కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆయన శాఖలను కూడా పియూష్ గోయల్‌కు కేటాయించారు ప్రధాని మోడీ.

కిడ్నీ స్టోన్ సర్జరీ చేయించుకోబోతున్నట్లు పియూష్ గోయల్ ట్వీట్ చేయగానే పలువురు బీజేపీ ఎంపీలు త్వరగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్లు చేశారు. బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ‘టేక్ కేర్ సర్’ అంటూ ట్వీట్ చేశారు. అలాగే బీజేపీ ఎంపీలు సంజయ్ టాండన్, పూనం మహాజన్ సహా పలువురు నేతలు గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్లు చేశారు.

కాగా, మూడేళ్ల క్రితం కూడా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కిడ్నీ స్టోన్స్ సర్జరీ చేయించుకున్నారు. ముంబైలో ఓ ప్రెస్ మీట్‌లో ఉండగా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా 4 mm స్టోన్ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించడంతో ఎండోస్కోపీ సర్జరీ చేసి దానిని తొలగించినట్లు ఏసియన్ ఏజ్ రిపోర్ట్ వెల్లడించింది.