మున్సిపల్ రిజర్వేషన్ల వెనుక పక్కా ప్లాన్​!

మున్సిపల్ రిజర్వేషన్ల వెనుక పక్కా ప్లాన్​!

మెజారిటీ మంత్రులకు ‘జనరల్​ కేటగిరీ’ ఆఫర్​

ఎవరినైనా నిలిపి, గెలిపించుకునే చాన్స్
సిద్దిపేట జిల్లాలోని మున్సిపాలిటీలన్నీ జనరల్ మయం
మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలో పదింట తొమ్మిది ‘జనరల్’ కోటాలోకే!
కొన్నిచోట్ల వారసుల ఆశలు గల్లంతు
కొందరు ప్రతిపక్ష నేతలకు వ్యూహం ప్రకారం చెక్

రాష్ట్రం యూనిట్​గా మున్సిపల్​ చైర్​పర్సన్, మేయర్​ పదవులకు ఆదివారం ప్రకటించిన రిజర్వేషన్లు ప్రీ ప్లాన్డ్​గా ఖరారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెజారిటీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను కావాలనే జనరల్​ కేటగిరీలోకి చేర్చారని, తద్వారా ఆయాచోట్ల తమకు కావాల్సినవారిని నిలిపి, గెలిపించుకునే చాన్స్​ కల్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్​ సొంత జిల్లా సిద్దిపేటలో ఐదు మున్సిపాలిటీలు ఉంటే ఐదింటికి ఐదు జనరల్ చేయాలని ప్రయత్నించారు. చివర్లో డ్రా కారణంగా ఇందులో నాలుగు  మున్సిపాలిటీలు జనరల్​(మహిళ)గా మారాయి. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్​ నియోజకవర్గంలో మొత్తం మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు ఉండగా, ఒక్క కార్పొరేషన్​ తప్ప మిగిలినవన్నీ జనరల్​కు గానీ, జనరల్ ( మహిళ)కుగానీ రిజర్వ్​ అయ్యాయి. మిగిలిన మినిస్టర్లు ప్రాతినిధ్యం వహించిన నియోజవర్గాల్లోనూ ఇలాంటి చిత్రాలే కనిపించాయి.

రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లోని చైర్​పర్సన్​, 13 కార్పొరేషన్లలోని మేయర్​ పదవులకు మున్సిపల్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌(సీడీఎంఏ) టీకే శ్రీదేవి ఆదివారం రిజర్వేషన్లు ప్రకటించారు. మున్సిపాలిటీల్లో బీసీలకు 32.5శాతం,  ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 3.25 శాతం, కార్పొరేషన్లలో బీసీలకు 31 శాతం, ఎస్సీలకు 8 శాతం, ఎస్టీలకు  8 శాతం కోటా ఇచ్చినట్లు చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం తాను ముందుగా అనుకున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒక ప్లాన్​ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించిదనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం సహా మెజారిటీ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జనరల్​ కేటగిరీ(అన్​ రిజర్వుడ్​)లోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. డివిజన్లవారీ రిజర్వేషన్లను ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల సమక్షంలో తేల్చగా, మున్సిపల్​ చైర్​పర్సన్​, మేయర్​ పదవుల రిజర్వేషన్లను మాత్రం రాష్ట్రం యూనిట్​గా హైదరాబాద్​లో ఖరారు​ చేశారు. ఇక్కడ ప్రగతి భవన్​ నుంచి వచ్చిన లిస్టునే ఆఫీసర్లు ఫైనల్​ చేశారనే ఆరోపణలున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం మెజారిటీ మంత్రుల నియోజకవర్గాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జనరల్​ చేశాక, ఆ లిస్టులోంచే మహిళలకు 50శాతం  కేటాయించారు. మహిళా కోటా తేల్చేందుకు మాత్రమే గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్‌‌‌‌‌‌‌‌ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆదివారం డ్రా తీశారు. వివిధ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో మొత్తం 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా, అందులో ఏకంగా 21 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జనరల్​గానీ, జనరల్​ మహిళ గానీ అయ్యాయి.

ఏ మంత్రి ఇలాకాలో చూసినా..

సీఎం కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనరల్​కు రిజర్వ్​ చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గజ్వేల్​, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్​ మున్సిపాలిటీలుండగా, ఇందులో గజ్వేల్​ జనరల్​ కాగా, మిగిలిన మూడు జనరల్​ మహిళకు రిజర్వ్​ అయ్యాయి. మంత్రి -గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, కొత్తపల్లి మంత్రి ఈటల రాజేందర్ పరిధిలోని జమ్మికుంట, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిధిలోకి వచ్చే జెల్​పెల్లి, తుక్కుగుడ మున్సిపాలిటీలు, మంత్రి సత్యవతి రాథోడ్  పరిధిలోని మహబూబాబాద్ మున్సిపాలిటీలు జనరల్ ​కోటాలో పడ్డాయి. ఇక మంత్రి హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, మంత్రి జగదీశ్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట,  మంత్రి పువ్వాడ అజయ్​ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం, మంత్రి ఈటల రాజేందర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్​ మున్సిపాలిటీ, మంత్రి సబిత పరిధిలోని బడంగ్‌‌పేట కార్పొరేషన్  జనరల్​ మహిళకు దక్కాయి. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్​ నియోజకవర్గంలో మొత్తం మూడు కార్పొరేషన్లు ఫిర్జాదిగూడ, బోడుప్పల్ జనరల్​ కాగా, ఒక్క జవహర్​నగర్​ మాత్రం బీసీ మహిళకు దక్కింది.  మిగిలిన ఏడు మున్సిపాలిటీల్లో నాలుగు చైర్​పర్సన్​ స్థానాలు జనరల్​కు, మూడు జనరల్​ మహిళకు రిజర్వ్​ కావడం విశేషం.

ఇక్కడ కాస్త డిఫరెంట్​.. అక్కడా సమీకరణాలే..

​ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ఆశించినట్లుగా మహబూబ్​నగర్​- బీసీ జనరల్​కు రిజర్వ్​ అయింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూర్​ చైర్​పర్సన్​ స్థానం మాత్రం ముందునుంచి అనుకుంటున్నట్లు  ఎస్సీ జనరల్​కు రిజర్వ్​ చేశారు. ఇక్కడ ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అందువల్ల దీనిపై మొదటి నుంచీ మంత్రి ఎర్రబెల్లి ఎలాంటి ఆశలూ పెట్టుకోలేదు. ఇక మంత్రి కేటీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల బీసీ మహిళకు రిజర్వ్​ అయింది. అక్కడ  బీసీల సంఖ్య, అందులోనూ నేతకార్మికులు ఎక్కువగా ఉన్నందున ఆ వర్గానికి చెందినవారికి  చైర్​పర్సన్​ స్థానం కట్టబెట్టాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. కాగా, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి మాత్రం బీసీ జనరల్​కు రిజర్వ్​ అయింది. ఈ స్థానం జనరల్​కు రిజర్వ్​ కావాలని మంత్రి ఆశించినా జరగలేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలెవరూ చైర్మన్​ స్థాయిలో లేరు. జనరల్​కు కేటాయిస్తే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మంత్రి కావాలనే బీసీలకు రిజర్వు చేయించుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. కేసీఆర్​ తనయ మాజీ ఎంపీ కవిత ఓటమికి కూడా ఇదొక కారణమైంది. దీనిని జనరల్​కు కేటాయిస్తే బీజేపీ తరఫున ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా  పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. ఆయన బలమైన అభ్యర్థికావడం, ఓసీ జనరల్ కు రిజర్వ్ చేస్తే  బీజేపీని అడ్డుకోవడం కష్టమని భావించే బీసీ మహిళ కు రిజర్వ్ చేశారనే టాక్​ వినిపిస్తోంది.

లీడర్ల వారసులకు, విపక్ష నేతలకు దెబ్బ..

మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే, కొన్నిచోట్ల మున్సిపల్​ చైర్​పర్సన్లుగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఆశించిన టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల కొడుకులు, ఇతర కుటుంబసభ్యులకు, పట్టుకోసం పట్టణాలను గుప్పిట్లో పెట్టుకోవాలని భావించిన విపక్ష నేతలకు ప్రభుత్వ పెద్దలు కావాలని చెక్​ పెట్టినట్లు భావిస్తున్నారు. అలాంటివాటిలో మచ్చుకు కొన్ని..

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మున్సిపల్​ చైర్మన్​ స్థానాన్ని ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి ఆశించారు. జనరల్ కు రిజర్వ్​ అయితే రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని భావించారు. కానీ బీసీ జనరల్ కావడంతో ఎమ్మెల్యే, ఆయన సోదరుని ఆశలు గల్లంతయ్యాయి.

మంచిర్యాల జనరల్​ అయితే తన భార్య,  డీసీసీ చైర్ పర్సన్ సురేఖను బరిలోకి దింపాలని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భావించారు. కానీ ఈ స్థానం బీసీ జనరల్ కు రిజర్వ్ అయింది. రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ప్రేమ్ సాగర్​రావు దంపతులకు నిరాశే మిగిలింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన మున్సిపల్ ఎన్నికల్లో తన భార్య సురేఖను గెలిపించుకొని పట్టణంపై పట్టు నిలుపుకోవాలని అనుకున్నారు. మంచిర్యాల జనరల్ అయితే ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు తన చిన్న కొడుకు విజిత్ రావును చైర్మన్​ అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ఊహాగానాలకు తెరపడింది.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీకి ఇది తొలి ఎన్నిక.  పంచాయతీగా ఉన్న బాన్సువాడను  ఏడాది క్రితం మున్సిపాలిటీగా మార్చారు. ఇది జనరల్​కు రిజర్వ్​ అయితే స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి సోదరుడు పోచారం శంభురెడ్డిని చైర్మన్​ అభ్యర్థిగా బరిలో నిలుపుతారనే ప్రచారం జరిగింది. కానీ దీనిని బీసీ జనరల్​కు కేటాయించడంతో వీరి ఆశలు గల్లంతయ్యాయి.

పెద్దపల్లి మున్సిపాలిటీ చైర్​పర్సన్​ స్థానాన్ని జనరల్​ మహిళకు కేటాయించారు. జనరల్​ అయితే స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి  కొడుకు దాసరి ప్రశాంత్​ రెడ్డిని బరిలో నిలుపుతాడనే ప్రచారం జరిగింది. జనరల్​ మహిళకు కేటాయించడంతో ఆయన నిరుత్సాహంలో ఉన్నారు. కానీ ఎమ్మెల్యే తన కోడలిని రంగంలోకి దింపుతారని పార్టీ వర్గాల సమాచారం.

పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గతంలో ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండగా, రొటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిన ఈ సారి బీసీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతుందని ఇక్కడి లీడర్లు ఆశించారు. రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుకూలిస్తే బీజేపీ నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆసక్తి చూపారు. టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన పాతిపెల్లి ఎల్లయ్య, పెంట రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్డాల రామస్వామి ప్రచారం చేసుకున్నారు. కానీ ఈసారి కూడా ఎస్సీ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించడంతో వీరి ఆశలు గల్లంతయ్యాయి. ఇక్కడ కావాలనే సోమారపు సత్యనారాయణకు చెక్​ పెట్టారని భావిస్తున్నారు.

జగిత్యాల మున్సిపాలిటీ నుంచి రిజర్వేషన్​ అనుకూలిస్తే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరదలు విజయలక్ష్మి బరిలో ఉంటారని  భావించారు. కానీ బీసీ మహిళ కు కేటాయించడంతో   ఆ అవకాశం లేకుండా పోయింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి