- అతడు లేకపోవడంతో అల్లుడి తండ్రి, అన్నపై కత్తులతో దాడి
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : తన కూతురు మరణానికి కారణమైన అల్లుడిని హత్య చేసేందుకు ఓ వ్యక్తి ప్లాన్ చేశాడు. మరో నలుగురితో కలిసి అల్లుడి ఇంటికి వెళ్లగా అతడు లేకపోవడంతో వియ్యంకుడు, అల్లుడి అన్నపై కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో అల్లుడి తండ్రి చనిపోగా, అతడి అన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం... కంజర గ్రామానికి చెందిన బోయేటి సత్యనారాయణ కూతురు వర్షకు, అదే గ్రామానికి చెందిన గోవర్దన్‌తో 14 ఏండ్ల కింద పెండ్లి జరిగింది.
వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్ష సూసైడ్ చేసుకోవడంతో పోలీసులు గోవర్దన్‌పై కేసు నమోదు చేశారు. 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న గోవర్ధన్ ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే తన కూతురు వర్ష మరణానికి అల్లుడే కారణమని అతడి మామ సత్యనారాయణ పగ పెంచుకున్నాడు. అల్లుడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకొని నలుగురు బంధువుల సాయం తీసుకున్నాడు. బుధవారం కంజరలో ఊర పండుగ జరగడంతో అందరూ విందులో ఉన్నారు.
అల్లుడిని చంపేందుకు ఇదే సరైన సమయమని భావించిన సత్యనారాయణ బంధువులతో కలిసి రాత్రి అల్లుడి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో గోవర్ధన్ లేకపోవడంతో అతడి తండ్రి నరహరి, అన్న గోపి కండ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నరహరి అక్కడికక్కడే చనిపోగా, గోపికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ సురేశ్, మోపాల్ ఎస్సై యాద గౌడ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతుడి పెద్ద కొడుకు గోపి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.