ఎన్నికల అజెండాగా  హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్

ఎన్నికల అజెండాగా  హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్
  • అసెంబ్లీ ఎన్నికలే అజెండాగా బ్యూటిఫికేషన్​కు ప్లానింగ్
  • పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు రెడీ
  • ఇప్పటికే రెయిలింగ్, స్ట్రీట్ లైటింగ్ పూర్తి
  • తొందరలోనే రివర్ ఫ్రంట్,   నైట్ బజార్ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు : హుస్సేన్ సాగర్ బ్యూటిఫికేషన్ ఎన్నికల అజెండాగా మారింది.  రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే హుస్సేన్​సాగర్​ను ఐకానిక్ ​ప్లేస్ గా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో  మరిన్ని ఆధునిక హంగులు జోడించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెయిలింగ్ పనులు, పాత కాలపు స్ట్రీట్ లైట్లతోపాటు, పాత్ వేలను అప్ గ్రేడ్ చేశారు.  రూ.1500 కోట్లతో హుస్సేన్ సాగర్​తో పాటు దాని చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ పనులకు 2018లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే రూ.350 కోట్ల​ అభివృద్ధి పనులను పూర్తి చేశారు.14 కి.మీ  విస్తరించిన హుస్సేన్ సాగర్ ప్రాంతంలో బోటింగ్, బుద్ధుడి విగ్రహాం, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాలు పర్యాటకులను ఎంతగానో  ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా  లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్ తో పాటు అభివృద్ధి పనుల్లో భాగంగా కొత్తగా ఏర్పాటైన  అమ్యూజ్ మెంట్ పార్కులు, ఫుడ్ కోర్టులకు జనాల తాకిడి పెరుగుతోంది. దీంతో మరింత అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏను కేటీఆర్ ఆదేశించారు.

 గత ఎన్నికల్లోనే హామీ..

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికారులు  పెండింగ్ పనులపై దృష్టి పెట్టారు.  ఇందులో బయో రెమిడియేషన్, ల్యాండ్ స్కేప్ డెవలప్ మెంట్, గ్రీనరీతో పాటు, పీవీ స్టాచ్యూ, నెక్లెస్ రోడ్డులో వీడీసీసీ పనులు, సైక్లింగ్​ ట్రాకులు, రెయిలింగ్ పనులు, పాత్ వేల నిర్మాణం చేసి, సండే ఫండే పేరిట జనాలను ఆకట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లోనే హుస్సేన్ సాగర్ డెవలప్ మెంట్ ఎలక్షన్ అజెండాగా ఉంది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదు. కేవలం పై పై మెరుగులు తప్ప... నాలాల గుండా వచ్చే సీవరేజీ వాటర్​ను కూడా పూర్తి స్థాయిలో ట్రీట్​మెంట్​​ చేయలేకపోయినట్లు విమర్శలు వచ్చాయి.  నిధుల కొరత, పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలతో పనులు ముందుకు సాగలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి హుస్సేన్ సాగర్​ను ఐకానిక్​గా ప్రమోట్ చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.  సాగర్ అడుగు భాగాన్ని ముట్టుకోకుండానే చుట్టూరా డెవలప్​  చేసేలా రూపొందించిన ప్రణాళికలను మంత్రి కేటీఆర్​ అనుమతించారు.

కమర్షియల్ యాక్టివిటీ కోసం..

హుస్సేన్ సాగర్ చుట్టూ కమర్షియల్ యాక్టివిటీని పెంచేలా నైట్ బజార్, రివర్ ఫ్రంట్ తరహాలో భారీ నిర్మాణాలకు హెచ్ఏండీ శ్రీకారం చుట్టింది. దాదాపు రూ. 50 కోట్లతో పనులు చేయనుంది. దీంతో పర్యాటకులు మరింత  పెరిగే అవకాశం ఉంది.  సంజీవయ్య పార్కు సమీపంలో అమ్యూజ్ మెంట్ పార్కు, ఫుడ్ కోర్టులను ఇటీవలే ప్రారంభించారు. గో కార్టింగ్ కూడా పీపుల్ ప్లాజాలో పీపీపీ విధానంలో ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 30 కోట్లతో 6 కి.,మీ  పొడువున వాన నీరు నిలవకుండా వీడీసీసీ రోడ్లను నిర్మించారు.  తాజాగా   రివర్ ఫ్రంట్ హ్యాగింగ్ వంతెన నిర్మించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.