బాసరకు మహర్దశ..కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు

బాసరకు మహర్దశ..కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు
  •     పుష్కర ఘాట్ నిర్మాణాలపై దృష్టి
  •     గోదావరి ఎంట్రెన్స్ వద్ద భారీ ఏర్పాట్లు
  •     సరస్వతి ఆలయానికి వైభవం

నిర్మల్, వెలుగు:  గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి  నిర్ణయించడంతో సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదాయ, పర్యాటక శాఖలు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి నిర్మల్ జిల్లా అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు జిల్లాలోని మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే మొదలుపెట్టనున్నారు. ఒకేరోజు 2 లక్షల మంది గోదావరి నదిలో పుష్కర స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేపట్టాలంటూ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నిర్మల్​జిల్లాలోని బాసర వద్ద భారీ ఏర్పాట్లు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఘాట్ల విస్తరణ

బాసరలో అదనంగా పుష్కర ఘాట్లు నిర్మించడంతోపాటు సరస్వతి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభమయ్యే పుష్కరాల సమయంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశాలున్న నేపథ్యంలో పార్కింగ్ ఏరియాను ప్రత్యేకంగా నిర్మించనున్నారు. బాసర తరహాలోనే సోన్ వద్దకు కూడా పుష్కరాల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో సోన్​ వద్ద సైతం అదనంగా పుష్కర ఘాట్లు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

ఆ ప్రాంతాల్లో సదుపాయాల ఏర్పాటు

ప్రతి 12 ఏండ్లకోసారి జరిగే పుష్కరాల్లో భక్తులు నిర్మల్ జిల్లాలోని బాసర, సోన్ పుష్కర ఘాట్లు ఉన్నా పుష్కరాల సమయంలో అవి ఏమాత్రం సరిపోవు. ఈ రెండు చోట్ల ఘాట్లను విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇక పుష్కరాల సమయంలో గోదావరి తీరం ఉన్న ఓనీ, కౌట, సాలాపూర్, ముథోల్ మండలంలోని ఆష్ట, బ్రహ్మగావ్, లోకేశ్వరం మండలం కనకాపూర్ శివారులోని బ్రహ్మేశ్వరాలయం, పంచగుడి, వాస్తాపూర్, మోహల, పిప్రి, భామ్ని, గడ్​చందా, దిలావర్​పూర్​ మండలంలోని సాంగ్లి, కంజర, టెంబుర్ని, ఆర్లి, కాండ్లి, సోన్ మండల కేంద్రంతో పాటు లక్ష్మణ్ చాంద మండలంలోని పీచర, ధర్మారం, పారుపల్లి, చింతల్ చందా, మామడ మండలంలోని కమల్ కోట్, పొన్కల్, ఖానాపూర్ మండలంలోని బాదన్ కుర్తి, కొత్తపేట, సుర్జాపూర్, బాబాపూర్ వద్ద కూడా ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. కానీ ఈ ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఘాట్లతోపాటు ఇతర సౌక ర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  

నాలుగు శాఖల సమన్వయంతో..  

ఇరిగేషన్, రెవెన్యూ శాఖతోపాటు దేవాదాయ, పర్యాటక శాఖలు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. పోలీసు శాఖ, పంచాయతీ శాఖల సహకారం తీసుకోనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పుష్కరాలు పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోబోతున్నారు.