
ఘట్కేసర్, వెలుగు: నకిలీ దస్తావేజులతో ప్లాట్లు విక్రయించి, మూడేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఘట్కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లకుంటకు చెందిన బి.సురేందర్‌రెడ్డితోపాటు మరో నలుగురు ఘట్కేసర్ మండలం కొర్రెములలో సర్వే నంబర్లలో 740, 741, 742లో 6 ఎకరాల భూమిని యజమానుల వద్ద కొనుగోలు చేశారు. అయితే కట్కూరి ప్రభాకర్‌రెడ్డి అదే సర్వే నంబర్లలో 6,292 గజాల భూమిని జీపీఏ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 15909/2005 ద్వారా కొనుగోలు చేశాడు.
కొద్దిరోజుల తరువాత ప్రభాకర్ రెడ్డి ఈ భూమిని ఎ. వీరయ్య, పి.సోమిరెడ్డిలకు రిజిస్టర్ డాక్యుమెంట్ల ద్వారా విక్రయించాడు. ఇంతటితో ఆగకుండా రెండోసారి ఇతరులకు విక్రయించాడు. దీంతో తమకు డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడని ప్రభాకర్ రెడ్డిపై 2011లో బాధితులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన ప్రభాకర్‌రెడ్డి తన ఒరిజినల్ జీపీఏ డాక్యుమెంటైన 15909/2005 ద్వారా 31 నకిలీ దస్తావేజులు తయారు చేసి బి. సురేందర్‌రెడ్డి కొనుగోలు చేసిన భూమిలోని ప్లాట్లను చూపించాడు.
దీంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సురేందర్‌రెడ్డి భూమిలోకి వస్తుండడంతో వారిని ఆయన గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సురేందర్‌రెడ్డి 2019లో పోలీసులు మరోసారి కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. గత మూడేండ్లుగా కోర్టులో కేసు నడుస్తున్నా ప్రభాకర్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో న్యాయస్థానం అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఘట్కేసర్ పోలీసులు పక్కా సమాచారంతో నగరంలోని కొండాపూర్‌లో గురువారం ఉదయం అరెస్టు చేసి, సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.