మెంబర్​షిప్​ తీసుకుంటేనే పింఛన్​ ఇస్తరట!

మెంబర్​షిప్​ తీసుకుంటేనే పింఛన్​ ఇస్తరట!

టార్గెట్​ రీచ్ ​అయ్యేందుకు టీఆర్​ఎస్​ లీడర్ల మైండ్​గేమ్
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బెదిరిస్తున్నరు
రైతుబంధు, కల్యాణ లక్ష్మి, డబుల్​ బెడ్​రూం ఇండ్ల లబ్ధిదారులకూ సభ్యత్వాలు
వృద్ధులను, ఐకేపీ మహిళలనూ వదలట్లే
లీడర్ల జేబుల్లోంచే మెంబర్​షిప్​ ఫీజులు
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బెదిరిస్తున్నరు
రైతుబంధు, కల్యాణ లక్ష్మి,
డబుల్​ బెడ్​రూం లబ్ధిదారులకూ సభ్యత్వాలు
లీడర్ల జేబుల్లోంచే మెంబర్​షిప్​ ఫీజులు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే విధిగా టీఆర్ఎస్ సభ్యత్వం ఉండాలె.. ఇప్పటి నుంచి వచ్చే మూడేండ్ల వరకు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటం.. పార్టీలో ఉన్న అర్హులకే  స్కీంలు అందిస్తం.. సభ్యత్వం తీసుకున్నోళ్లకు ఇన్సూరెన్స్ వస్తది.

– శనివారం స్టేషన్ ఘన్​పూర్​లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

 

టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నరు. పింఛన్ దారులు, రైతుబంధు తీసుకుంటున్నవాళ్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందుతున్న వాళ్లను గుర్తించండి.. వాళ్లందరితో తప్పకుండా టీఆర్ఎస్ సభ్యత్వం చేయించండి.

– ఈ నెల 19న కుమ్రంభీం ఆసిఫాబాద్ లో మంత్రి సత్యవతి రాథోడ్

వెలుగు, నెట్వర్క్: 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మెంబర్​షిప్​ చేయాలని, ప్రతి నియోజకవర్గంలో 50 వేల మార్కు దాటాలని టీఆర్ఎస్​ హైకమాండ్​ టార్గెట్​పెట్టడంతో దానిని రీచ్​ అయ్యేందుకు ఆ పార్టీ లీడర్లు కట్టు తప్పుతున్నారు. పింఛన్లు, రైతుబంధు, ఇతర పథకాలు రావాలంటే పార్టీ మెంబర్​షిప్​ తీసుకోవాల్సిందేనని బెదిరించి మరీ సంతకాలు పెట్టించుకుంటున్నారు. వృద్ధులు, బీడీ కార్మికులు, ఐకేపీ మహిళలను కూడా వదలట్లేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలైతే టీఆర్ఎస్​సభ్యత్వం లేనివారికి సంక్షేమ పథకాలు ఇవ్వబోమని
బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. మెంబర్​షిప్​ తీసుకున్నవాళ్లకే అన్ని స్కీముల్లో ప్రియారిటీ ఇస్తామంటూ మైండ్​గేమ్​ ప్లే చేస్తున్నారు. పార్టీ విధానాలు నచ్చి స్వేచ్ఛగా తీసుకోవాల్సిన  మెంబర్​షిప్​ను ఇలా రాజకీయం చేయడం ఏమిటని సామాన్యులు అంటున్నారు.

లీడర్ల ఉరుకులు పరుగులు

15 రోజుల్లో ఒక్కో నియోజకవర్గానికి 50 వేలు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలనే టీఆర్ఎస్​ హై కమాండ్​ఆదేశాలతో నియోజకవర్గాల్లో లీడర్లు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఫిబ్రవరి 12న మెంబర్‍షిప్‍ డ్రైవ్‍ అఫీషియల్‍గా స్టార్ట్​ అయింది. శనివారం నాటికి ఇచ్చిన గడువు ముగిసింది. కానీ చాలాచోట్ల ఇంకా టార్గెట్​ పూర్తికాలేదు. దీంతో లీడర్లకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు టెన్షన్​ పట్టుకుంది. కింది స్థాయిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర పార్టీ లీడర్లపై ఒత్తిడి తెస్తున్నారు. వీరంతా మెంబర్​షిప్​ తీసుకోకపోతే పింఛన్లు రావని చెబుతూ వృద్ధులు, బీడీకార్మికులు, ఐకేపీ మహిళల పేర్లు రాసుకొని పోతున్నారు. సభ్యత్వం తీసుకోకపోతే డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు రావని బెదిరిస్తున్నారు. రైతుబంధు, కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్​ ఫండ్​ లబ్ధిదారులకూ మెంబర్​షిప్​ అంటగడుతున్నారు. లీడర్లు, సర్పంచ్​లపై  భయంతోనో, భక్తితోనో ఊళ్లలో కామన్​ పబ్లిక్​ సభ్యత్వం తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులూ బెదిరిస్తున్నరు

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మెంబర్​షిప్​ కోసం కామన్​ పబ్లిక్​ను బెదిరిస్తున్నారు. ఈ నెల 19 న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై రివ్యూ మీటింగ్​జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందుతున్న పింఛన్​దారులు, రైతుబంధు తీసుకుంటున్న రైతులు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందుతున్న వారందరితో తప్పకుండా టీఆర్ఎస్ సభ్యత్వం చేయించాలని క్యాడర్​ను ఆదేశించారు. ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే విధిగా టీఆర్ఎస్ సభ్యత్వం ఉండాలె’ అని స్టేషన్​గన్​పూర్​ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంటే,  ‘టీఆర్‍ఎస్‍ పార్టీ కండువా కప్పుకున్న బాపతోళ్లకే ఇండ్లు కట్టిస్తం’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనడం గమనార్హం.

మెంబర్​షిప్ పైసలు లీడర్లే పెట్టుకుంటున్నరు

నియోజకవర్గాల్లో సభ్యత్వాల కోసం  మండల, గ్రామ ఇన్​చార్జిలను నియమించారు. వీళ్ల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ కార్యకర్తలతో మీటింగ్​లు పెట్టి టార్గెట్లు అప్పగించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల​ పరిధిలోనైతే కౌన్సిలర్లకు, మండలాల్లో అయితే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లకు, ప్యాక్స్​, ఏఎంసీ ప్రెసిడెంట్లకు  వాళ్ల వాళ్ల కెపాసిటీని బట్టి 200 నుంచి 500 వరకు రిసిప్ట్​లు ఉన్న బుక్స్​అందించారు. దీంతో వీళ్లంతా గ్రామాల్లో తిరుగుతూ సభ్యత్వాలు చేస్తున్నారు. సాధారణ మెంబర్​ షిప్​కు రూ.30, క్రియాశీలకమైతే రూ.100 మెంబర్​షిప్​ ఫీజు చెల్లించాల్సి ఉండగా, పబ్లిక్​ఎవరూ కట్టట్లేదు. ఇలాగైతే టార్గెట్​ రీచ్​ కావడం కష్టమని టీఆర్ఎస్ లీడర్లే ‘మీరు పైసా కట్టాల్సిన పనిలేదు.. పైగా రూ.2 లక్షల ఇన్యూరెన్స్​ కూడా ఉంటది..’ అని చెప్పి అందరి పైసలూ వాళ్ల జేబుల్లోంచే పెట్టుకొని మెంబర్​షిప్​ ఇస్తున్నారు.

సిరిసిల్లలో 4 రోజుల్లో 70 వేల సభ్యత్వాలు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: టీఆర్​ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కేటీఆర్​ఇలాకా అయిన సిరిసిల్లలో పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి.  మెంబర్ షిప్​ కార్యక్రమానికి ఆ పార్టీలోని పలువురు లీడర్లు, కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో కనీసం 60 వేల సభ్యత్వాలు చేయాలనే టార్గెట్​పెట్టుకుంటే గడిచిన 12 రోజుల్లో పట్టుమని 10 వేల మందినీ చేర్పించలేకపోయారు. దీంతో​ నేతల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్​ తన పీఏలు బండారి తిరుపతి, మహేందర్​రెడ్డిని  రంగంలోకి దించారు. సిరిసిల్లలోనే మకాం వేసిన ఈ ఇద్దరూ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా 70 వేల మందితో మెంబర్​షిప్​ చేయించారు. 12 రోజుల్లో కానిది నాలుగు రోజుల్లో చేయడం రాజకీయంగా హాట్​టాపిక్​లా మారింది. నాలుగంటే నాలుగు రోజుల్లో 70 వేల మంది వివరాలు రాసుకెళ్లిన మంత్రి మనుషులు.. ఏడాదిగా పింఛన్లురాక, ప్రభుత్వ స్కీ ములు అందక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నవాళ్ల పేర్లను కూడా రాసుకెళ్తే బాగుండేదని కామన్​ పబ్లిక్​ సెటైర్​ వేస్తున్నారు.