ప్రారంభించిన్రు.. వదిలేసిన్రు

ప్రారంభించిన్రు.. వదిలేసిన్రు
  • పరికరాలు రాలే.. మొక్కలు నాటలే
  • 1,176 హ్యాబిటేషన్లలో 687 స్థలాల గుర్తింపు..
  • 32 ప్రారంభం ఆదిలాబాద్ లో ప్రారంభించినవి మూడే

ఆదిలాబాద్,వెలుగు: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్లే గ్రౌండ్​ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. నెల రోజులుగా ఆఫీసర్లు స్థల సేకరణ చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈనెల 2న గ్రౌండ్​లను ఆర్భాటంగా ప్రారంభించారు. ఇంకా చాలాచోట్ల స్థల సేకరణ పూర్తికాలేదు. కలెక్టర్​ సిక్తాపట్నాయక్​ గ్రౌండ్​ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించడంతో తహసీల్దార్లు స్థల సేకరణలో నిమగ్నమయ్యారు. అయినా అనుకున్న మేరకు గ్రౌండ్​ల ఏర్పాటు పూర్తికావడం లేదనే వాదన ఉంది. అంతేకాదు క్రీడా ప్రాంగణాల్లో అవసరమైన వసతులూ లేవు.

28 ప్రారంభం..
ఆదిలాబాద్​ జిల్లాలోని17 మండలాల్లో 34 క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలం కొరత కారంణగా 28 మాత్రమే ప్రారంభించారు. అయితే ప్రారంభించిన సగం గ్రౌండ్​లలో పూర్తి స్థాయి సౌకర్యాలు లేవు. మరికొన్నింటిలో అరఎకరం జాగా కూడా లేకపోవడం విశేషం.

కనిపించని వసతులు..
జిల్లా వ్యాప్తంగా 1,176 హ్యాబిటేషన్లలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించగా కేవలం 687 స్థలాలలను మాత్రమే గుర్తించారు.  ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ. 4 లక్షల ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రారంభించిన గ్రౌండ్​లలో కొత్త బోర్డులు.. భూమి చదును తప్పా మరేమీ కనిపించడంలేదు. ఖోఖో, కబడ్డీ, వాలీ బాల్, లాంగ్ ​జంప్ ​కోర్టులు ఏర్పాటు చేయలేదు. సింగిల్, డబుల్ స్తంబాలు లేవు. క్రీడాకారులకు ఎలాంటి కిట్లూ అందజేయలేదు. గ్రౌండ్​ల చుట్టూ వేప, గుల్మోహర్, కానుగ, చింత తదితర మొక్కలు నాటాల్సి ఉండగా ఎక్కడ కూడా కనిపించడంలేదు. మరోవైపు నిధుల సమస్యా వేధిస్తోంది. వాటి నిర్వహణకు పంచాయతీల్లో నిధులే లేక.. అటు ఉపాధి హామీ నిధులు రాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఆదిలాబాద్​లో నత్తనడక..
పట్టణాల్లోని వార్డుల్లో సైతం గ్రౌండ్​లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో 49 వార్డుల్లో 98 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పట్టణంలో ఈప్రక్రియ నత్తనడకన సాగుతోంది. స్థల సమస్యతో ప్రాంగణాలు ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు 25 చోట్ల స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించగా మూడే పూర్తిచేశారు.  

పనులు చేస్తున్నాం..
గ్రౌండ్​ల అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నాం. స్థల సేకరణ కోసం చర్యలు తీసుకుంటున్నాం. గుర్తించిన ప్రాంగణాల్లో ఎప్పటికప్పుడు పనులు చేపడుతున్నాం. పరికరాలు, ఇతర వసతుల కోసం పంచాయతీ నిధులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- కిషన్, డీఆర్డీవో