ఆన్ లైన్ లో ఆటలాడి ప్రాణాలు తీసుకుంటున్నారు

ఆన్ లైన్ లో ఆటలాడి ప్రాణాలు తీసుకుంటున్నారు

హైదరాబాద్, వెలుగుఆన్‌‌లైన్‌‌ గేమ్స్ కు అడిక్ట్ అయి జనం ప్రాణాలు తీసుకుంటున్నారు. స్టూడెంట్ల నుంచి పెద్దల వరకు అందరూ ఆన్ లైన్ లో ఆటలాడి రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరైతే అప్పులు చేసి మరీ గేమ్స్ ఆడుతున్నారు. డబ్బులు పోయాక మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ లో ఏం చేయాలో తెలియక చాలామంది గేమ్స్ కు అలవాటుపడ్డారు. అయితే వాటికి బానిసలుగా మారిపోయి, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.

పిల్లలు గేమ్స్..

గేమ్స్ లో స్టేజీలు ఉంటాయి. తర్వాతి స్టేజ్ కు వెళ్లాలంటే సరిపడా పాయింట్లు, వెపన్స్ ఉండాలి. లేకపోతే కొనాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్‌‌లైన్‌‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. దీన్ని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. గెలిస్తే బహుమతులు ఉంటాయని, మనీ ప్రైజ్ గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తారు. కానీ గేమ్ ఎంతకూ ముందుకెళ్లదు. దీంతో పదేపదే డబ్బులు పెట్టాల్సి వస్తుంది. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు పేమెంట్స్ చేస్తూ, మెసేజ్ లను డిలీట్ చేసేస్తున్నారు. ఇటీవల ఓ స్టూడెంట్ ఇలాగే రూ.5.4 లక్షలు పోగొట్టడంతో కుటుంబసభ్యులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్ తో డబ్బులు గుంజడం ఒక ఎత్తయితే.. వీడియో గేమ్స్ తోనూ డబ్బులు కొట్టేస్తున్నారు. పిల్లలు, స్టూడెంట్లు ఆడే సమయంలో పాయింట్లు కావాలంటే లింక్ క్లిక్ చేయాలని సూచిస్తున్నారు. అది క్లిక్ చేస్తే పూర్తి డేటా అవతలి వ్యక్తికి తెలిసిపోతుంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు కొట్టేస్తున్నారు.

పెద్దలు జూదం…

  • పిల్లలు, యువత గేమ్స్ ఆడుతుంటే.. ఎంప్లాయ్స్, పెద్దలు జూదం ఆడుతున్నారు. చాలామంది రమ్మీ బాట పట్టారు. ఫోన్‌‌లో నెట్‌‌, అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు ఎక్కడి నుంచైనా రమ్మీ ఆడొచ్చు. ఈ ఆటలాడుతూ చాలా మంది జీవితాలను రోడ్డున పడేసుకుంటున్నారు. ఆన్ లైన్ లో పేకాటకు సంబంధించి 20కి పైగా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చాలామంది జంగల్‌‌ రమ్మీ, క్లాసిక్‌‌ రమ్మీ, ప్లే రమ్మీ, ఫస్ట్‌‌ గేమ్స్‌‌ డాట్‌‌ కాం, డెక్కన్‌‌ రమ్మీ డాట్‌‌ కాం తదితర వెబ్‌‌సైట్‌‌లలో పేకాట ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
  •  మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం మోదెల గ్రామానికి చెందిన మధూకర్‌‌ హైదరాబాద్‌‌లో బీటెక్‌‌ ఫైనలియర్‌‌ చదువుతున్నాడు. లాక్‌‌డౌన్ లో ఇంటికి వెళ్లిన మధూకర్ సెల్‌‌ఫోన్‌‌లో దఫాబెట్‌‌ గేమ్‌‌ ఆడడం మొదలుపెట్టాడు. దానికి అడిక్ట్ అయి రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. విషయం తండ్రికి తెలియడంతో అప్పు తెచ్చి కట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో మనస్తాపానికి గురైన మధూకర్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
  • మంథనికి చెందిన ఓ ప్రైవేట్ ఎంప్లాయ్ లాక్ డౌన్ లో ఖాళీగా ఉండడంతో సరదాగా ఆన్‌‌లైన్‌‌లో గేమ్స్ ఆడడం ప్రారంభించాడు. మొదట 30 వేలు రాగా, వాటితో పాటు మరో 80వేలు పోగొట్టుకున్నాడు. ఇలా ఆన్ లైన్ గేమ్స్ బాధితులు ఇంకెంతో మంది ఉన్నారు.

అప్పులకూ యాప్స్

ఆన్ లైన్స్ గేమ్స్ కు అడిక్ట్ అయిన స్టూడెంట్లు అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని యాప్స్ అందుబాటులో ఉండడంతో వాటిని ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అప్పుల కోసం విద్యార్థులైతే స్టూడెంట్‌‌ ఐడీ, ఆధార్‌‌ కార్డు, ఫోన్‌‌ నంబర్, ఈ–మెయిల్, ఫేస్‌‌బుక్‌‌ తదితర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్లయితే ఆధార్, బ్యాంకు స్టేట్‌‌మెంట్లను ఇవ్వాలి. వాటిని ధ్రువీకరించుకున్న తర్వాత ఆయా యాప్స్‌‌ రూ.500 నుంచి అప్పులివ్వడం ప్రారంభిస్తాయి. రీపేమెంట్ ను బట్టి లిమిట్ పెంచుకుంటూ పోతాయి. కొంతమందైతే డబ్బులు పోవడంతో బండ్లు, ఫోన్లు తాకట్టు పెడుతుండగా, మరికొంత మంది అమ్ముకుంటున్నారు. చాలామంది బయట మిత్తికి అప్పులు కూడా తీసుకుంటున్నారు.

పేరెంట్స్ వాచ్ చేయాలి

ఇలాంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. పిల్లలను ఎప్పుడూ పేరెంట్స్ వాచ్ చేస్తుండాలి. ఎక్కువ సేపు గేమ్స్ ఆడనివ్వొద్దు. వాటికి అడిక్ట్ కాకుండా చూసుకోవాలి. డబ్బులు పోతే వెంటనే పోలీస్‌‌ స్టేషన్, బ్యాంకుల్లో కంప్లయింట్ ఇవ్వాలి.

– హిప్నో కమలాకర్, సైకాలజిస్ట్