- సుప్రీంకోర్టులో ఢిల్లీ లాయర్ పిటిషన్
న్యూఢిల్లీ: ‘కరోనా వేగంగా వ్యాపిస్తున్న ఈ టైంలో దేశంలోని అన్ని ప్రైవేటు మెడికల్ ఇనిస్టిట్యూట్‌లను ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకోవాలి.. ఆస్పత్రులు, ల్యాబ్‌లు సహా అన్నింటినీ తాత్కాలికంగా జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. వైరస్ పరీక్షలతో పాటు ట్రీట్మెంట్కూడా ఫ్రీగా అందించేలా చూడాలి’ అని ఢిల్లీకి చెందిన లాయర్ అమిత్ ద్వివేది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని గురువారం పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు ప్రైవేటు ల్యాబ్‌లలో కూడా కరోనా టెస్టులను ఫ్రీగా చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఆస్పత్రులన్నింటిని జాతీయం చేయాలని ద్వివేది పిటిషన్ వేశారు.
కరోనా ప్యాండెమిక్ ను ఎదుర్కోవడానికి మన దేశంలో తగినన్ని వైద్య సదుపాయాలు లేవని ద్వివేది చెప్పారు. ఈ కష్టకాలంలో వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులు, లేబరేటరీలు, కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం వైద్య రంగంపై చిన్నచూపు చూస్తోందన్నారు. తక్కువ ఆదాయంగల దేశాలు కేటాయిస్తున్నన్ని నిధులు కూడా మన ప్రభుత్వాలు కేటాయించడంలేదన్నారు. ప్రభుత్వ హెల్త్ కేర్ సిస్టం ఇలా ఉంటే.. ప్రైవేటు హెల్త్ కేర్ సిస్టం మాత్రం వేగంగా పెరుగుతోందని చెప్పారు. మెడికల్ టూరిజం కూడా ఏటా 200 శాతం అభివృద్ధి నమోదు చేస్తోందని ద్వివేది తన పిటిషన్లో పేర్కొన్నారు.

