స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం కల్పించాలి: సుప్రీంలో పిల్

స్త్రీలకు మసీదుల్లో ప్రవేశం కల్పించాలి: సుప్రీంలో పిల్
  • స్త్రీలు రాకూడదని ఖురాన్ లో లేదన్న పిటిషనర్లు
  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం తీర్పు ప్రస్తావన
  • కేంద్రం, ముస్లిం లా బోర్డుకు ధర్మాసనం నోటీసులు
  • అఫిడవిట్ వేసేందుకు 10 రోజుల టైం ఇచ్చిన కోర్టు

న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలకు ప్రవేశంపై నిషేధం ఎత్తేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై మంగళవారం జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని నోటీసు ఇస్తూ వాదనలను 10 రోజుల పాటు వాయిదా వేసింది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులకు నోటీసులు ఇచ్చింది కోర్టు. తమ అఫిడవిట్ల దాఖలుకు నాలుగు వారాల పాటు టైం ఇవ్వాలని కోరగా, అందుకు కోర్టు అంగీకరించలేదు. పది రోజుల్లోనే ఫైల్ చేయాలని ఆదేశించింది.

పిటిషన్‌లో శబరిమల తీర్పు ప్రస్తావన

స్త్రీలు మసీదుల్లోకి రాకూడదని ప్రవిత్ర ఖురాన్‌లో ఎక్కడ చెప్పలేదంటూ మహారాష్ట్రలోని పుణేకు చెందిన ముస్లిం జంట ఈ పిటిషన్ వేసింది. దేశంలో చాలా వరకు మహిళల్ని అడ్డుకుంటున్నారని, చట్టవ్యతిరేకమని, రాజ్యంగ విరుద్ధమని వారు అన్నారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను మతం, సాంప్రదాయం పేరుతో అడ్డుకోలేరని, లింగ వివక్ష చూపడాన్ని అంగీకరించలేమని నాడు కోర్టు వ్యాఖ్యానించిందని వారు పిటిషన్లో వివరించారు. పవిత్ర ఖురాన్‌లోనూ, మహ్మద్ ప్రవక్త భోదనల్లోనూ ఎక్కడా మహిళలు మసీదులోకి రాకూడదని చెప్పలేదన్నారు పిటిషనర్లు. మగవాళ్లలాగే, స్త్రీలు కూడా ప్రార్థనలు చేసుకోవచ్చన్నారు. అలా కాదని అడ్డుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు హరించడమే అవుతుందని చెప్పారు.

సుప్రీంకోర్టు కూడా అదే మాట

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆడవారి ప్రవేశంపై నిషేధం ఉండేది. ఆ సంప్రదాయానికి గత ఏడాది సెప్టెబంరు 28న సుప్రీం కోర్టు తీర్పుతో ఫుల్ స్టాప్ పెట్టింది. లింగ వివక్ష చట్టవిద్ధమని, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను మతం పేరుతో అడ్డుకోలేరంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆందోళనలు, నిరసనల మధ్య కొందరు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకున్నారు. కొందరు మహిళలు మాత్రం సాంప్రదాయాన్ని పాటించాల్సిందేనంటూ నిరసనకారులకే మద్దతు పలికారు. అయితే ఇప్పుడు తాజాగా దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్లు నాటి తీర్పును ప్రస్తావించారు. అలాగే నాటి శబరిమల తీర్పు ఉన్నందునే ప్రస్తుతం ఈ పిల్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని సుప్రీం కోర్టు చెప్పింది.