
హైదరాబాద్, వెలుగు : బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మంగా తెలంగాణలో ఒక లోక్ సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్ లో ఆ పార్టీ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, పశ్య పద్మ, బాలమల్లేశ్ తో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన 4 ఎంపీ స్థానాల్లో ఒకటి సీపీఐ కోరిన స్థానం కూడా ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆచరణయోగ్యంగా ఆలోచించాలని కూనంనేని సూచించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కేసీఆర్ను కలవడం దురదృష్టకరమని విమర్శించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ను వ్యతిరేకించిన బీఎస్పీ వైఖరిలో ఇంతలోనే ఎందుకు అంత మార్పు వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.