పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం శనివారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. సమావేశంలో నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా మంచినీటి సరఫరా మెరుగుదలకు కొత్త బోర్వెల్లు తవ్వాలని, పాత వాటికి తక్షణమే మరమ్మతులు చేపట్టి మోటార్లను మార్చాలని సూచించారు. కంటోన్మెంట్ బోర్డు స్థలాలను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. హోర్డింగుల విషయంలో చిన్న వ్యాపారులపై అధిక చార్జీల భారం వేయకుండా రాయితీలు కల్పించాలని కోరారు. అలాగే రామన్న కుంట చెరువు అభివృద్ధి పనులకు త్వరగా ఎన్వోసీ ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
