
న్యూఢిల్లీ: ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ కింద దేశంలో ప్రొడక్షన్ ప్రారంభించిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు మొదటి ఏడాదికి గాను రాయితీలు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్మార్ట్‌ఫోన్ల తయారీకి గాను కంపెనీకి మొదటి ఫైనాన్షియల్ ఇయర్‌లో ఇన్సెంటివ్‌లు అందవని, దీనికి కారణం కంపెనీ ఇన్‌వాయిసింగ్‌లో తప్పులు దొర్లడమేనని అధికారులు చెబుతున్నారు. శామ్‌సంగ్ మాత్రం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ప్రకటించింది. 2019–20 తో పోలిస్తే 2020–21 ఫైనాన్షియల్ ఇయర్‌లో అదనంగా రూ.15 వేల కోట్ల విలువైన ప్రొడక్షన్‌ను చేరుకోవడంతో రూ.900 కోట్ల విలువైన రాయితీలను శామ్‌సంగ్ క్లయిమ్ చేసింది. కానీ, కంపెనీ ఇన్‌వాయిస్‌లలో కొన్ని లోపాలను గుర్తించిన మ ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ, రాయితీలను రిలీజ్ చేయడాన్ని ఆపేసింది. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని శామ్‌సంగ్ ప్రతినిధి పేర్కొన్నారు.
వాల్యుయేషన్‌లో సమస్యలు..
శామ్‌సంగ్ ఇన్‌వాయిస్‌లలో వాల్యుయేషన్ సమస్యలు ఉన్నాయని, వీటిని వెరిఫై చేశామని, ఇప్పుడు లెక్కలు సరిపోయాయని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, మొదటి ఏడాదికి గాను ఇన్సెంటివ్‌లు కంపెనీకి అందకపోవచ్చని, సెకెండ్ ఇయర్‌కు సంబంధించి ఇన్సెంటివ్‌లు త్వరలో రిలీజ్ అవుతాయని అన్నారు. ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్, విస్ట్రన్ వంటి కంపెనీలు , డిక్షన్ టెక్నాలజీస్ కూడా 2021–22 కి సంబంధించి తమ ఇన్సెంటివ్‌లను అందుకున్నాయి. శామ్‌సంగ్ వంటి గ్లోబల్ కంపెనీలు పీఎల్‌ఐ కింద ఇన్సెంటివ్‌లను పొందాలంటే మొదటి నాలుగు ఫైనాన్షియల్ ఇయర్లలో కనీసం రూ.250 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయాలి.