రైతును రారాజు చేయడమే మోదీ లక్ష్యం.. అన్నదాతల అకౌంట్లలో రూ.18,690 కోట్లు: బండి సంజయ్‌‌

రైతును రారాజు చేయడమే మోదీ లక్ష్యం.. అన్నదాతల అకౌంట్లలో రూ.18,690 కోట్లు: బండి సంజయ్‌‌

గండిపేట, వెలుగు: రైతును రారాజుగా చేయడమే ప్రధాని మోదీ  లక్ష్యమని  కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌ రాజేంద్రనగర్‌‌లోని ఐసీఏఆర్‌‌ -–ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ రైస్‌‌ రీసెర్చ్‌‌ (ఐఐఆర్‌‌ఆర్‌‌) వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన ప్రధానమంత్రి కిసాన్‌‌ సమ్మాన్‌‌ నిధి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. 2014తో పోలిస్తే దేశ వ్యవసాయ బడ్జెట్‌‌ను ఐదు రెట్లు పెంచామని, రైతుల అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రధాన మంత్రి కిసాన్‌‌ సమ్మాన్‌‌ నిధి పథకం ద్వారా ఇప్పటివరకూ 23 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ చేశామని వివరించారు.

తాజాగా మరో విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,690 కోట్లను జమ చేస్తున్నట్టు  వెల్లడించారు. తెలంగాణలోనూ 30 లక్షల మందికిపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు.  కిసాన్‌‌ సమ్మాన్‌‌ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయాన్ని 92 శాతం మంది రైతులు వ్యవసాయ అవసరాలకే ఖర్చు చేస్తున్నారని, దీని ఫలితంగా 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.