
- వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలను సృష్టించాలి: ప్రధాని మోడీ
- సాగు వ్యయం తగ్గించే పరిశోధనలు జరగాలిd
- ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఇక్రిశాట్ వ్యవ‘సాయం’
- కొత్త టెక్నాలజీతో అగ్రికల్చర్ సెక్టార్‌లో పెనుమార్పులు
- పటాన్‌చెరులో ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభించిన పీఎం
హైదరాబాద్, వెలుగు: ఇక్రిశాట్ రీసెర్చ్‌లు ప్రపంచానికి కొత్తదారి చూపాలని, వ్యవసాయ రంగ బలోపేతానికి సైంటిస్టులు మరింత కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని హాజరయ్యారు. ఉత్సవాల లోగోను, స్టాంప్‌ను ఆవిష్కరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని, ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు.
తర్వాత అగ్రికల్చర్ సైంటిస్టులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘దేశంలో 80 శాతం మంది చిన్న కమతాల రైతులే ఉన్నారు. పంటల దిగుబడిపై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సన్నకారు రైతుల సాగు వ్యయం తగ్గించేలా ఇక్రిశాట్ సైంటిస్టుల రీసెర్చ్‌లు ఉండాలి” అని సూచించారు. మెట్ట ప్రాంత రైతులకు ఇక్రిశాట్ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి సాయం అందించడంలో ఇక్రిశాట్ చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. టెక్నాలజీని మార్కెట్‌తో అనుసంధానించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తున్నదని కొనియాడారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాతావరణ మార్పుల కేంద్రం.. రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాగల 25 ఏళ్లు దేశానికి ఎంతో కీలకమైనవని, కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కోరారు.
సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి
డిజిటల్ వ్యవసాయం భారతదేశ భవిష్యత్ అని, వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మోడీ చెప్పారు. కొత్త టెక్నాలజీతో అగ్రికల్చర్ సెక్టార్‌లో పెనుమార్పులు రానున్నాయని అన్నారు. పంట అంచనా, భూరికార్డుల డిజిటలైజేషన్, పురుగుల మందులు, పోషకాలను డ్రోన్ల ద్వారా వెదజల్లడం వంటి వాటిలో టెక్నాలజీ వాడకం పెరిగిందని చెప్పారు. రైతులు సేంద్రియ సాగుపై మరింత దృష్టి పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.‘‘ఈయేడు బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. వాతావరణ సవాళ్ల నుంచి రైతులను రక్షించడానికి ‘బ్యాక్ టు బేసిక్– మార్చ్ టు ఫ్యూచర్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం” అని చెప్పారు. చిన్న రైతులను వేల సంఖ్యలో ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు)లుగా విస్తరించి శక్తిమంతమైన మార్కెట్ శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వ్యవసాయ వ్యాల్యూ చెయిన్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టిపెడుతున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెంచాలి
తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరిగేందుకు ఇక్రిశాట్ రీసెర్చ్‌లు దోహదం చేయాలని ప్రధాని అన్నారు. వాతావరణ మార్పులకు తట్టుకునే, పంటకాలం తక్కువగా ఉండే సరికొత్త వంగడాలను సృష్టించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంట దిగుబడి ఎక్కువగానే ఉందని చెప్పారు. 2070 నాటికి భారత్ ‘నెట్ జీరో ఎమిషన్స్’ లక్ష్యాల గురించి ప్రధాని ప్రస్తావించారు. ‘‘విశ్వానికి అనుకూలమైన ప్రజా ఉద్యమం ప్రతి సమాజాన్ని, ప్రతి వ్యక్తిని వాతావరణ మార్పుల విషయంలో బాధ్యతతో వ్యవహరించేలా అనుసంధానం చేస్తుంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు.. భారత ప్రభుత్వ చర్యల్లోనూ ప్రతిబింబిస్తోంది. వచ్చే 25 ఏళ్లలో చేసే కార్యక్రమాలపై లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. దేశంలో 6 రుతువులు, 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. 50 వరకు ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి. 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి’’ అని ప్రధాని వివరించారు.
మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నం
పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని మోడీ తెలిపారు. ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని 6 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఈ పంట సాగు ఆశావహంగా ఉందని తెలిపారు. పామ్ ఆయిల్ సాగు విషయంలో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. 35 మిలియన్ టన్నుల కోల్డ్ చైన్ స్టోరేజీ సామర్థ్యాన్ని సృష్టించడంతోపాటు, రూ.1 లక్ష కోట్ల వ్యయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వంట నూనెల విషయంలో స్వావలంబన దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నీటి సంరక్షణ, నదుల అనుసంధానం ద్వారా భూమిలో ఎక్కువ భాగాన్ని సాగు కిందికి తీసుకువస్తున్నామన్నారు. మరోవైపు పరిమిత నీటిపారుదల ఉన్న ప్రాంతాల్లో మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రతతోపాటు పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బయో ఫ్యుయల్‌తో రైతులకు సాగు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. రీసెర్చ్‌లు, ఆవిష్కరణలు రైతుల సమస్యలను తీర్చాలని, అంతిమంగా అందరి లక్ష్యం వ్యవసాయాభివృద్ధేనని ప్రధాని మోడీ వివరించారు. ఈ ప్రోగ్రామ్‌కు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని అభినందనలు తెలిపారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జి.కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు