యుద్ధాల కాలం కాదిది

యుద్ధాల కాలం కాదిది
  • ఆస్ట్రియా టూర్​లో ప్రధాని మోదీ కామెంట్
  • రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకుందామని పిలుపు
  • శాంతి ప్రక్రియలో ఇండియా కీలకం: ఆస్ట్రియా చాన్స్ లర్​

వియన్నా(ఆస్ట్రియా): ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. యుద్ధరంగంలో సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు దొరకవని.. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పారు. బుధవారం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశ ఫెడరల్ చాన్స్​లర్ కార్ల్ నెహామర్​తో మోదీ భేటీ అయి ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్ ఆసియాలో పరిస్థితులతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సంఘర్షణల గురించి చాన్స్​లర్ నెహామర్​తో సమగ్రంగా చర్చించానని మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలు ఏ సమస్యనైనా చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని తామిద్దరం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఆయా దేశాల మధ్య శాంతి ప్రక్రియ కోసం ఎలాంటి సహకారం కోసమైనా భారత్, ఆస్ట్రియా సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. రెండు దేశాల మధ్య మరింత కోఆపరేషన్ కు ఉన్న కొత్త అవకాశాలను గుర్తించాలని నిర్ణయించినట్టు మోదీ తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే దశాబ్ద కాలం పాటు కోఆపరేషన్ కోసం ఒక బ్లూ ప్రింట్ రూపొందించనున్నట్టు వెల్లడించారు.

టెర్రరిజాన్ని ఇరుదేశాలూ తీవ్రంగా ఖండిస్తున్నట్టు స్పష్టం చేశారు. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. తాను మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆస్ట్రియా పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు. గత 41 ఏండ్లలో ఆస్ట్రియాకు భారత ప్రధాని రావడం ఇదే మొదటిసారి అయినందున.. ఈ పర్యటన చరిత్రాత్మకంగా, ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన వంటి ఉమ్మడి విలువలు రెండు దేశాల మధ్య బలమైన పునాదిని వేశాయన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రయోజనాలు ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేశాయన్నారు.

ఉక్రెయిన్​లో శాంతికి భారత్ కీలకం: నెహామర్  

రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రక్రియకు భారత్ పాత్ర అత్యంత కీలకమని ఆస్ట్రియా చాన్స్ లర్ కార్ల్ నెహామర్ అన్నారు. ఈ విషయంలో ఇండియా ప్రభావవంతమైన, నమ్మకమైన దేశమని ఆయన కొనియాడారు. తటస్థంగా ఉంటూ శాంతి చర్చలకు వేదికగా నిలిచేందుకు కూడా ఆస్ట్రియా సిద్ధమని ప్రకటించారు. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, గ్లోబల్ సౌత్ ప్రాంతంలో కీలక దేశంగా ఎదిగిందన్నారు. 

వందేమాతరం గీతాలాపనతో గ్రాండ్ వెల్ కం..

రష్యా పర్యటన ముగించుకున్న మోదీ మంగళవారం రాత్రి యూరప్ లోని ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్నారు. ఆయనను వియన్నా ఎయిర్ పోర్టులో ఆస్ట్రియన్ విదేశాంగ మంత్రి రిసీవ్ చేసుకున్నారు. అక్కడ గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఆస్ట్రియన్ కళాకారులు వందేమాతరం ఆలాపనతో మోదీకి గ్రాండ్ వెల్ కం చెప్పారు. అనంతరం చాన్స్ లర్ నెహామర్ తో మోదీ ప్రైవేట్ మీటింగ్ సాగింది.

ఆస్ట్రియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ తోనూ మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బుధవారం చాన్స్ లర్​తో ద్వైపాక్షిక సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఆస్ట్రియాలోని భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలోనూ మోదీ పాల్గొన్నారు. కాగా, గత 41 ఏండ్లలో ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అధికారికంగా పర్యటించారు.