370ఆర్టికల్ పై రాహుల్ కు మోడీ సవాల్..!

370ఆర్టికల్ పై రాహుల్ కు మోడీ సవాల్..!

హర్యానా, మహారాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతమైంది. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారబరిలోకి దిగారు. ఇద్దరు నేతలు మహారాష్ట్రలోనే ప్రచారం సాగించారు. హర్యానాలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ధైర్యముంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన మోడీ… జల్గావ్, సకోలీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొచ్చే దమ్ము ఎవరికీ లేదన్నారు. దేశంలో గ్రామాల అభివృద్ధి కోసం 25లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు మోడీ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నీటి సంరక్షణ కోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 

కాంగ్రెస్-NCP ప్రభుత్వాలు గతంలో మహారాష్ట్రను దోచుకున్నాయని ఆరోపించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. 70వేల కోట్లతో ఇరిగేషన్ స్కీమ్ లు ప్రకటించినా… ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదన్నారు. ఆ సొమ్మంతా అవినీతి నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. సీఎం ఫడ్నవిస్, ప్రధాని మోడీలు మహారాష్ట్ర అభివృద్ధికి పనిచేశారని చెప్పారు. FDIలలో మహారాష్ట్రను ఫడ్నవిస్ నెంబర్ వన్ గా నిలిపారని చెప్పారు. కొల్హాపూర్ లో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు షా. పుణేలో రోడ్ షో చేశారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. SC/STలకు 3లక్షల రూపాయల వరకు ఉచిత రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు 3లక్షల వరకు వడ్డీ లేని రుణం, నెలకు 3వేల రూపాయల చొప్పున వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ కోసం 500 కోట్లతో ఏర్పాట్లు చేస్తామన్నారు. వ్యవసాయం, యువత, ఆరోగ్యరంగంపై ఫోకస్ పెట్టారు.

పాకిస్తాన్ తీరు మార్చుకోవాలన్నారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్. లేదంటే గతంలో పాకిస్తాన్ రెండు ముక్కలైందని… ఇప్పుడు చాలా ముక్కలవుతుందని చెప్పారు. ఉగ్రావాదాన్ని అంతం చేయాలని పాకిస్తాన్ అనుకుంటే భారత సైన్యాన్ని పంపి సాయం చేస్తామన్నారు. హర్యానాలో రాజ్ నాథ్ ఎన్నికల ప్రచారం చేశారు.

ప్రజా సమస్యలను ప్రధాని మోడీ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోని లాతూర్, చండీవాలీ, ధరావీలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్. కీలక అంశాల నుంచి ప్రజల దృష్టిని మోడీ మరలుస్తున్నారని మండిపడ్డారు. మీడియా కూడా సైలెంట్ అయిందన్నారు. రైతు సమస్యలు, నిరుద్యోగం, ధనవంతులకు లోన్ల మాఫీ లాంటివాటిపై మీడియా మౌనంగా ఉందన్నారు రాహుల్. ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మోడీ, రాహుల్ గాంధీలు ఇవాళ్టి నుంచే ప్రచారబరిలోకి దిగారు.