పాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం

పాలక్కాడ్ బస్సు ప్రమాద బాధితులకు ప్రధాని ఆర్థిక సాయం

కేరళ పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని మోడీ అధికారులను ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

కేరళ పాలక్కాడ్ జిల్లాలోని వడక్కెంచేరిలో కేరళ ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సును ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఊటీ టూర్ కు వెళ్తుండగా.. కేరళ ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో స్కూల్ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. గాయపడిన వారిలో 12మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.