మన ప్రొడక్టులే కొనండి

మన ప్రొడక్టులే కొనండి

న్యూఢిల్లీ: 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసిన ఇండియా.. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వ్యాక్సినేషన్‌‌ రికార్డులో హెల్త్‌‌ కేర్ వర్కర్లది కీలక పాత్ర అని అన్నారు. వీలైనంత ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు.. అన్ని అడ్డంకులను వాళ్లు అధిగమించారని కొనియాడారు. ఆదివారం మన్‌‌ కీ బాత్‌‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మోడీ.. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయాలని దేశ ప్రజలను కోరారు. లోకల్ ప్రొడక్టులనే కొనాలని, స్థానిక కళలను, హ్యాండీక్రాఫ్టులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ సీజన్‌‌లో ‘ఓకల్‌‌ ఫర్‌‌‌‌ లోకల్‌‌’ ఇనీషియేటివ్‌‌ను బలోపేతం చేయాలన్నారు. ‘‘మీరు లోకల్ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే.. అది మీ పండుగను ప్రకాశవంతం చేయడమే కాదు.. మన పేద సోదరుడు లేదా సోదరి, కళాకారుడు లేదా నేత కార్మికుడి ఇంటిని కూడా వెలిగిస్తుంది. ఓకల్ ఫర్ లోకల్ ప్రచారానికి ఈ సారి మరింత మద్దతు అందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా” అని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 30, 31 తేదీల్లో ఇటలీలో జరగనున్న జీ 20 సమ్మిట్‌‌కు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. యూపీలో కొత్తగా నిర్మించిన 9 మెడికల్ కాలేజీలను ఆయన సోమవారం ప్రారంభిస్తారు.

ప్రధాని ఇంకా ఏం చేప్పారంటే..

  • అమృత్‌‌ మహోత్సవాలను పురస్కరించుకుని దేశభక్తి గీతాల పోటీ పెడుతున్నట్లు చెప్పారు. కొత్త ఇండియా ఆలోచనలను ప్రతిబింబించేలా.. భవిష్యత్‌‌ సంకల్పానికి ఊతమిచ్చేలా పాటలు రాయాలని యువతకు పిలుపునిచ్చారు.
  • డ్రోన్లకు సంబంధించిన ప్రస్తుత, భవిష్యత్ అవకాశాల ప్రకారం డ్రోన్​ పాలసీని రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. దేశీ డ్రోన్ కంపెనీలకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌‌‌ఫోర్స్ రూ.500 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయని చెప్పారు.
  • 2014 నుంచి 2020 దాకా మహిళా పోలీసు ఆఫీసర్లు డబుల్ అయ్యారని ప్రధాని చెప్పారు. ఆర్మీ, పోలీస్‌‌ సర్వీసులు పురుషులకు మాత్రమే అనే భావన గతంలో ఉండేదని, ఇకపై అలా ఉండబోదని ప్రధాని మోడీ తెలిపారు.