సంస్కరణలతో కొత్త దారులు తెరిచాం

సంస్కరణలతో కొత్త దారులు తెరిచాం

చెన్నై: ‘బలమైన ప్రభుత్వమంటే.. అన్నింటినీ, అందరినీ కంట్రోల్ చేయాలి’ అనే భావనను ఎన్డీయే సర్కారు మార్చివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నో సంస్కరణలను తెచ్చిందని, కొత్త మార్గాలను తెరిచిందని, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. బలమైన ప్రభుత్వమెప్పుడూ ఎవరనీ కంట్రోల్ చేయదని.. వ్యవస్థ స్పందించేలా ప్రేరేపిస్తుందని తెలిపారు. ‘‘ఒక బలమైన ప్రభుత్వం ప్రతి చోటుకు వెళ్లదు. అది నిర్బంధించేది కాదు.. ప్రతిస్పందించేది. అది తనను తాను పరిమితం చేసుకుంటుంది. ప్రజల నైపుణ్యానికి చోటు కల్పిస్తుంది. తనకు అన్నీ తెలియవని, తాను అన్ని పనులనూ చేయలేనని వినయంతో అంగీకరించడంపైనే బలమైన ప్రభుత్వం బలం ఆధారపడి ఉంటుంది. అందుకే మీరు ప్రతి రంగంలోనూ ప్రజలకు, స్వేచ్ఛ చోటు కల్పించే సంస్కరణలను చూస్తున్నారు” అని వివరించారు.

అన్నా యూనివర్సిటీ 42వ కాన్వొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రధాని హాజరయ్యారు. యువ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ఈ రోజు విజయాల దినం కాదని, ఆకాంక్షల రోజు అని అన్నారు. ఏంజెల్ ట్యాక్స్, రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ తొలగింపు, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు వంటివి పెట్టుబడులను, ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకేనని చెప్పారు. ‘‘డ్రోన్లు, అంతరిక్షం, జియోస్పాటికల్ రంగాల్లో తెచ్చిన సంస్కరణలు కొత్త దారులను తెరిచాయి. ‘ప్రధాన మంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం” అని వివరించారు. 

స్టార్టప్స్ 15 వేల శాతం పెరిగినయ్

‘‘కరోనా ప్రతి దేశాన్ని పరీక్షించింది. ఈ గుర్తుతెలియని ప్రమాదాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది. సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్ వర్కర్లు, ప్రొఫెషనల్స్, సాధారణ ప్రజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇండియా ఇప్పుడు ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రేడ్.. ఇలా అన్నింటా దూసుకెళ్తోంది. ప్రపంచంలో ముఖ్యమైన స్థానంలో ఉంది” అని అన్నారు. ఎలక్ట్రానిక్స్ సెక్టార్ పరంగా చూస్తే.. మొబైల్ ఫోన్ల తయారీలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ‘‘ఇన్నోవేషన్ అనేది ఓ జీవన విధానంగా మారుతున్నది. ఆరేండ్లలో గుర్తింపు పొందిన స్టార్టప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంఖ్య 15 వేల శాతం పెరిగింది. 2016లో 470 స్టార్టప్స్ ఉండగా.. ఇప్పుడు 73 వేలకు చేరాయి. కిందటేడాది ఇండియా రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది” అని ప్రధాని చెప్పుకొచ్చారు. కాన్వొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. స్థలాభావం వల్ల వేదిక వద్దకు రాలేని స్టూడెంట్లను కలిసేందుకు 
క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని కలియతిరిగారు.