- ఎన్జీటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అంతర్జాతీయ సమిట్
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ కలిసి సాగాలని చెప్పారు. పర్యావరణ సమస్యలకు న్యాయ, శాస్త్రీయ, విధానపరమైన పరిష్కారాలను కనుగొనేందుకు దేశాల మధ్య సహకారం అవసరమన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్’ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
‘అభివృద్ధి.. ప్రకృతి’
భారతీయ సంస్కృతి ప్రకారం ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదని మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ‘నమస్తే’ అనే పలకరింపు విస్తరించడం కూడా భారతీయ జీవన విధానంలోని ఈ భావనకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఆధునిక వాతావరణ సవాళ్లకు భారతీయ సంప్రదాయ జ్ఞానం కూడా పరిష్కార మార్గాలను చూపుతోందన్నారు. అభివృద్ధి వేగంగా సాగుతూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని చెప్పారు. ‘‘అభివృద్ధి వేగంగానూ.. స్థిరంగానూ ఉండొచ్చు’’ అనే భావనను ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి పరస్పర విరుద్ధమైనవి కావని స్పష్టం చేశారు.
వాతావరణ మార్పులపై బాధ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే మోపడం సరికాదని మోదీ అన్నారు. భారత్ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉన్నాయని చెప్పారు. వాతావరణ చర్యలు చేపట్టేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయం అందుబాటులో ఉండాలని అన్నారు. 12 ఏళ్లలో పర్యావరణ రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని మోదీ తెలిపారు. ప్యారిస్ ఒప్పందంలోని కాప్–21 లక్ష్యాలను గడువుకు ముందే సాధించిన జీ–20 దేశం ఇండియా ఒక్కటేనని వివరించారు. ఈ సదస్సులో ఎన్జీటీ మొబైల్ అప్లికేషన్ను మోదీ ప్రారంభించారు.
యువతకు ఉద్యోగాలపై దృష్టి
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, పెట్టుబడులు, కొత్త పరిశ్రమల విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని మోదీ అన్నారు. శనివారం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో 20వ రోజ్గార్ మేళా నిర్వహించారు. మోదీ వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొని 51 వేలకు పైగా నియామక పత్రాలు అందించి మాట్లాడారు. 40 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కొత్త మార్కెట్లు, భాగస్వామ్యాలు, అవకాశాలను పెంచుతున్నాయని చెప్పారు. ఎన్ఈపీ, స్కిల్ ఇండియా, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పీఎంసేతు కింద రూ.60 వేల కోట్లతో వెయ్యి ఐటీఐలను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు.
