
- గాంధీ జయంతికి ‘స్వదేశీ’ని ఆదరిస్తూ గర్వించండి: మోదీ
- ‘వోకల్ ఫర్ లోకల్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయండి
- ఆర్ఎస్‌ఎస్ వందేండ్లుగా జాతీయ సేవలో తరిస్తున్నది
- మన్ కీ బాత్ 126వ కార్యక్రమంలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న భారతీయులందరూ స్వదేశీ వస్తువులను ఆదరించి, గర్వపడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క ఖాదీ ఉత్పత్తినైనా కొనాలని, ‘వోకల్ ఫర్ లోకల్’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు.
ఆదివారం మన్‌కీ బాత్126వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టారని, ఈ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించారని చెప్పారు.
కానీ.. ఆ తర్వాత ఖాదీకి ప్రజాదరణ తగ్గిందన్నారు. తమ హయాంలో గత 11 ఏండ్లుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తి, ఆదరణ పెరిగిందని వివరించారు. ఖాదీలాగే మన చేనేత, హస్తకళా రంగం కూడా గణనీయమైన మార్పులను చూస్తున్నదని చెప్పారు.
సంప్రదాయం, ఆవిష్కరణలు కలిసిపోయినప్పుడు అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని, ఇందుకు తమిళనాడులోని ‘యాజ్ నేచురల్స్’ ఒక మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు.
అశోక్ జగదీశ్, ప్రేమ్సెల్వరాజ్ అనే ఇద్దరు తమ కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి గడ్డి, అరటి పీచుతో యోగా మ్యాట్లను తయారు చేస్తున్నారని తెలిపారు. హెర్బల్డైస్తో బట్టలకు రంగులు వేస్తున్నారని, 200 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.
జోహార్‌గ్రామ్ బ్రాండ్ ద్వారా గిరిజన నేత వస్త్రాలను ప్రపంచస్థాయికి తీసుకొవచ్చిన జార్ఖండ్‌కు చెందిన ఆశిష్ సత్యవ్రత్ సాహును ప్రశంసించారు. బిహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన స్వీటీ కుమారి కూడా సంకల్ప్ క్రియేషన్స్‌ను ప్రారంభించారని, ఆమె మిథిలా పెయింటింగ్‌ను మహిళలకు జీవనోపాధిగా మార్చారని తెలిపారు.
‘నేషన్ ఫస్ట్’ అనేదే ఆర్‌ఎస్‌ఎస్ నినాదం..
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) ఎల్లప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే నినాదంతో పనిచేస్తుందని, ప్రతి చర్యలోనూ అది కనిపిస్తుందని మోదీ తెలిపారు. నిస్వార్థ సేవకు, క్రమశిక్షణకు మారుపేరని ప్రశంసించారు.
ఆర్‌ఎస్‌ఎస్ వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో సంఘ్ సేవలను ప్రధాని కొనియాడారు. దేశాన్ని మేధో బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి 1925లో విజయదశమి నాడు ఆర్‌ఎస్‌ఎస్‌ను కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారని, అప్పటి నుంచి దాని ప్రయాణం అద్భుతంగా కొనసాగుతున్నదని చెప్పారు.
విమెన్ నేవీ ఆఫీసర్ల ధైర్య సాహసాలు భేష్
భారత పుత్రికలు అన్ని రంగాల్లో ధైర్య సాహసాలు చూపుతున్నారని మోదీ ప్రశంసించారు. విమెన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపతో ఫోన్‌లో మాట్లాడారు. వారు సముద్ర గర్భంలో తెగువను ప్రదర్శిస్తున్నారని అభినందించారు.
ఛట్ను యునెస్కో జాబితాలో చేర్చేందుకు కృషి
పండుగలు మన సంస్కృతిని సజీవంగా ఉంచుతాయని ప్రధాని మోదీ తెలిపారు. ఒకప్పుడు స్థానికంగానే ప్రసిద్ధి చెందిన ఛట్ పూజ ఇప్పుడు ప్రపంచ పండుగగా మారుతున్నదని, ఈ మహాపర్వాన్ని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు కృషిచేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలతోనే కోల్‌కతా దుర్గా పూజ యునెస్కో జాబితాలో చేరిందని గుర్తు చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి అర్పించారు. భగత్ సింగ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
లతా మంగేష్కర్ దేశభక్తి గీతాలను పాడారని, ఇది ప్రజలను ఎంతో ప్రేరేపించిందని గుర్తుచేశారు. అక్టోబర్ 7న వాల్మీకీ జయంతి ఉన్నదని, ఆయోధ్యలో రామాలయంతోపాటు వాల్మీకీకి కూడా గుడి కట్టామని తెలిపారు. కాగా, అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్‌కు, ప్రముఖ కన్నడ రచయిత భైరప్పకు మోదీ నివాళులర్పించారు.