బాధ్యత లేని ఆర్థిక పాలసీలతో నష్టమే : మోదీ

బాధ్యత లేని ఆర్థిక పాలసీలతో నష్టమే : మోదీ
  • ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్రాలు  జాగ్రత్తగా ఉండాలి: ప్రధాని మోదీ
  • ప్రజాకర్షక చర్యలు స్వల్పకాలక రాజకీయ ఫలితాలనివ్వొచ్చు
  • మున్ముందు భారీగా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటది.
  • ఒకప్పుడు ఆకలి కడుపులు.. ఇప్పుడు ఆకాంక్షలతో నిండిన మెదళ్లు
  • వెయ్యేండ్లకు గుర్తుండే అభివృద్ధికి పునాది వేసేందుకు గొప్ప అవకాశం
  • జీ20 సమ్మిట్ నేపథ్యంలో పీటీఐకి ప్రధాని ప్రత్యేక ఇంటర్వ్యూ

న్యూఢిల్లీ:  వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకునే నాటికి ఇండియా ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశంలో అవినీతి, కులతత్వం, మత తత్వానికి చోటు ఉండదని స్పష్టం చేశారు. తొమ్మిదేండ్లుగా రాజకీయ స్థిరత్వంతోనే పలు సంస్కరణలు సాధ్యమయ్యాయని తెలిపారు. బాధ్యత లేని ఆర్థిక పాలసీలు, ప్రజాకర్షక చర్యలతో దీర్ఘకాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కీలకమైన జీ20 సదస్సు వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)కు ప్రధాని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. 

80 నిమిషాలపాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. జీ20 నాయకత్వాన్ని ఇండియా చేపట్టడం పేద దేశాల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపిందని చెప్పారు. గైడెన్స్ కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తున్నదని అన్నారు. ‘‘ఇండియా విషయంలో ప్రపంచ దృక్పథం మారుతున్నది. మన మాటలను, మన విజన్‌‌ను భవిష్యత్‌‌కు రోడ్‌‌మ్యాప్‌‌లా చూస్తున్నది. ఒకప్పుడు భారతదేశం ఆకలితో ఉన్న వంద కోట్ల కడుపులుగా ప్రపంచానికి కనిపించింది. ఇప్పుడు ఆశయాలు, ఆకాంక్షలతో కూడిన వంద కోట్ల మెదళ్లు, నైపుణ్యం కలిగిన రెండు వందల కోట్ల చేతులు, కోట్లాది మంది యువత ఉన్న దేశంగా కనిపిస్తోంది. రాబోయే 1,000 ఏండ్లకు గుర్తుండిపోయే వృద్ధికి పునాది వేయడానికి ఈ రోజు భారతీయులకు గొప్ప అవకాశం ఉంది” అని వివరించారు. గత పదేళ్లలో జీడీపీ విలువల్లో ఐదు స్థానాలను ఇండియా ఎగబాకిందని చెప్పారు. 

వాళ్లకు ప్రజలపై నమ్మకం ఉండేది కాదు..

ఢిల్లీ వెలుపల హై-ప్రొఫైల్ గ్లోబల్ మీట్స్‌‌ నిర్వహించే విషయంలో ఇతర రాష్ట్రాల ప్రజలపై గత ప్రభుత్వాలకు నమ్మకం ఉండేది కాదని అన్నారు. కానీ తనకు మాత్రం దేశ ప్రజలపై ఎంతో విశ్వాసం ఉందని చెప్పారు. జీ20లో 1.5 కోట్ల మందికిపైగా దేశ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారని తెలిపారు. భారతదేశం అంతటా జీ20 సమావేశాలను నిర్వహించాలనే నిర్ణయాన్ని గురించి అడగ్గా.. ‘‘కొన్ని దేశాలు, పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ.. ఒలింపిక్స్‌‌తో సహా అనేక ఉన్నత స్థాయి గ్లోబల్ మీట్‌‌లను నిర్వహించే బాధ్యతలను చేపట్టాయి. 

ఈ మెగా ఈవెంట్ల ద్వారా ఆయా దేశాల్లో ఎంతో మార్పు జరిగింది. వారు వృద్ధి చెందారు. ప్రపంచం వారి సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. వాస్తవానికి ఇది వారి అభివృద్ధి ప్రయాణంలో ఒక మలుపుగా మారింది” అని ప్రధాని వివరించారు. ‘‘మీరు గమనిస్తే.. గత కొన్నేళ్లలో ప్రతి రీజియన్‌‌లోని ప్రజలపై మేం నమ్మకం ఉంచాం. 8వ బ్రిక్స్ సమ్మిట్‌‌ గోవాలో జరిగింది. 2వ ఫిపిక్ సమ్మిట్ జైపూర్‌‌‌‌లో జరిగింది. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్ సమ్మిట్ హైదరాబాద్‌‌లో జరిగింది. అలానే జీ20ని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించాం’’ అని తెలిపారు.

చైనా, పాక్‌‌ అభ్యంతరాలపై.. 

కాశ్మీర్‌‌, అరుణాచల్‌‌ప్రదేశ్‌‌లో జీ20 సదస్సు నిర్వహించడంపై చైనా, పాక్‌‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను మోదీ కొట్టిపారేశారు. దేశంలోని ప్రతి భాగంలో జీ20 కార్యక్రమాలు నిర్వహించడం సర్వసాధారణమని స్పష్టం చేశారు. మరోవైపు సైబర్‌‌ ముప్పులను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ‘‘సైబర్‌‌ ఉగ్రవాదం, ఆన్‌‌లైన్‌‌ రాడికలైజేషన్‌‌, మనీలాండరింగ్‌‌లు కేవలం ఓ చిన్న భాగం మాత్రమే. ఉగ్రవాదులు దేశాల సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే దారుణ లక్ష్య సాధన కోసం డార్క్‌‌నెట్‌‌, మెవెర్స్‌‌, క్రిప్టో కరెన్సీలను వాడుకొంటున్నారు. సైబర్‌‌ క్రైమ్‌‌పై పోరాడేందుకు ప్రపంచ సహకారం తప్పనిసరి” అని అన్నారు.

రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలి

ఒకప్పుడు కేవలం పెద్ద మార్కెట్‌‌గా మాత్రమే కనిపించిన భారతదేశం.. ఇప్పుడు ప్రపంచ సవాళ్లకు కనుక్కునే పరిష్కారాల్లో భాగమైందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ప్రపంచ చరిత్రలో భారత్‌‌ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. కానీ వలసవాదం వల్ల ప్రపంచ వేదికపై వెనుకబడిపోయింది. ప్రస్తుతం దేశం పురోగమిస్తున్నది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది” అని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘

బాధ్యత లేని ఆర్థిక పాలసీలు, ప్రజాకర్షక చర్యలు.. స్వల్పకాలక రాజకీయ ఫలితాలను ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో సామాజిక, ఆర్థిక మూల్యాన్ని భారీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలు లేదా ఇప్పటికే దాన్నుంచి బయటపడిన దేశాలు.. ఆర్థిక క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాయి. అందుకే రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని మోదీ సూచించారు.

ప్రతి గొంతుక ముఖ్యమైనదే

భారత్‌‌ అభివృద్ధి గమనాన్ని ఎన్నో దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ‘‘జీ20 ప్రెసిడెన్సీ ఇండియాకు దక్కడం.. ‘థర్డ్ వరల్డ్’గా పరిగణించే దేశాల్లో నమ్మకం తెచ్చింది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్త గ్రోత్ విషయంలో ‘గ్లోబల్ సౌత్’ దేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీ20లో ఆఫ్రికాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. జీడీపీ పరిమాణంతో సంబంధం లేకుండా.. ప్రతి గొంతుక ముఖ్యమైనదే” అని స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ.. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని అన్నారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ఉన్నా లేకున్నా.. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. జీడీపీ సెంట్రిక్ అప్రోచ్ నుంచి హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌‌లో చూసే దిశగా ప్రపంచం మారుతున్నదని, ‘సబ్‌‌కా సాథ్ సబ్‌‌కా వికాస్’ అనేది ఇందుకు మార్గదర్శక సూత్రమని చెప్పారు.