
- రాబోయే 25 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి
- కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన
- మోదీ ఆధ్వర్యంలో 5 గంటలపాటు కేంద్ర మంత్రి మండలి సమావేశం
న్యూఢిల్లీ: గత తొమ్మిదేండ్లలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అభివృద్ధి పనుల గురించి రానున్న తొమ్మిది నెలల్లో ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. బీజేపీ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చివరి లబ్ధిదారు ఈ ప్రయోజనాలను పొందగలిగే వరకు స్కీమ్స్‌ను కొనసాగించాలని స్పష్టం చేశారు. సోమవారం ప్రధాని ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌లో ఐదు గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. ఈ మేరకు సుమారు 20 నిమిషాల పాటు ప్రధాని ప్రసంగించినట్లు సమాచారం. ‘‘ప్రతి ఒక్కరూ ప్రస్తుతం గురించి లేదా వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు. కానీ మన ప్రభుత్వం రాబోయే 25 సంవత్సరాలు అంటే ‘విజన్ 2047’ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలి” అని మోదీ చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో రక్షణ, విదేశాంగ శాఖ సహా పలు మినిస్ట్రీల సెక్రటరీలు మాట్లాడినట్లు వెల్లడించాయి. భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే 2047 దాకా.. అనేక రంగాల్లో దేశ అభివృద్ధి ప్రయాణంపై సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపాయి.
ఫలవంతమైన సమావేశం: ప్రధాని
కేంద్ర మంత్రి మండలి సమావేశం ఫలప్రదంగా జరిగిందని ప్రధాని ట్వీట్ చేశారు. విధానపరమైన నిర్ణయాలపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కాగా, కరోనా మొదలైన తర్వాత కేంద్ర మంత్రి మండలి భేటీ కావడం ఇది రెండోసారి మాత్రమే. మంత్రి మండలిలో మార్పులు, చేర్పులపై ప్రధాని మోదీ ఈ భేటీలో సంకేతాలు ఇస్తారంటూ ప్రచారం సాగినా.. అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. మరోవైపు 2019లో ప్రధానిగా రెండోసారి మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఒకసారి మాత్రమే కేబినెట్ విస్తరణ జరిగింది.