యూపీ అబ్జర్వర్‎గా అమిత్ షా

యూపీ అబ్జర్వర్‎గా అమిత్ షా
  • 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై చర్చలు 
  • కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, పార్టీ చీఫ్ నడ్డా హాజరు
  • ఇయ్యాల ఆయా రాష్ట్రాలకు సెంట్రల్ అబ్జర్వర్లు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ లతో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నేతలతో సంప్రదించిన తర్వాత తాము తీసుకున్న నిర్ణయాలను పార్టీ అగ్రనేతలు ప్రధానికి వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం ఆయా రాష్ట్రాలకు పార్టీ సెంట్రల్ అబ్జర్వర్లు వెళ్లనున్నారని తెలిపాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. దీంతో పార్టీ రాష్ట్ర నేతల అంచనాలకు తగ్గట్లుగా కొత్త ప్రభుత్వాల ఏర్పాటు దిశగా పార్టీ పెద్దలు కసరత్తు చేశారు. మణిపూర్ లో ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్ కే రెండోసారి సీఎంగా చాన్స్ ఇస్తున్నట్లు ఆదివారం బీజేపీ ప్రకటించింది. గోవా సీఎం ఎవరన్నది సోమవారం తేలిపోయే అవకాశం ఉంది.

యూపీ అబ్జర్వర్ గా అమిత్ షా 
యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. కేబినెట్​లో ఎంత మంది ఉండాలి, ఎవరెవరికి, ఏ శాఖలు ఇవ్వాలి అన్నది తేలాల్సి ఉంది. వీటన్నింటిని చూసుకోవడానికి యూపీ అబ్జర్వర్ గా అమిత్ షాను నియమించారు.  ఓడిపోయిన డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యకు కేబినెట్​లో చాన్స్ దక్కుతుందా? లేదా? అన్నదీ ఆసక్తికరంగా మారింది. అయితే, యూపీ కొత్త కేబినెట్ అంశంపై యోగి ఇదివరకే ప్రధాని మోడీ, పార్టీ అగ్రనేతలపై చర్చించారు.